Friday, November 22, 2024

26న అల్వాల్‌ టిమ్స్‌కు సీఎం శంకుస్థాపన.. 1000 పడకల సామర్థ్యంతో నిర్మాణం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పేదలకు సర్కారు వైద్యాన్ని మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్రాల రోగులకూ వైద్య సేవలు అందిస్తున్న గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ తరహాలో హైదరాబాద్‌ నగరం చుట్టూ మరో మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌కు నలువైపులా గచ్చిబౌలిలో ఇప్పటికే ఉన్న తెలంగాణ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌ )తోపాటు ఎల్‌బీనగర్‌, సనత్‌నగర్‌, ఆల్వాల్‌ ప్రాంతాల్లో మరో మూడు టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి న విషయం తెలిసిందే. ఈ ఆసుపత్రుల నిర్మాణానికి గాను రెండు రోజుల క్రితమే రూ.2679 కోట్లను విడుదల చేసింది.

రానున్న ఏడాదిలోపు ఈ మూడు ఆసుపత్రులను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. నిధులు విడుదలైన రెండు రోజుల్లోనే అల్వాల్‌ ప్రాంతంలో కొత్త టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 26న మధ్యాహ్నం 12 గంటలకు అల్వాల్‌లో టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఆసుపత్రి నిర్మాణ స్థలాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్‌ రాజు, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో కలిసి పరిశీలించారు. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా జరిగే శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. అల్వాల్‌ టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీని రూ.900 కోట్లతో నిర్మించనున్నారు. అల్వాల్‌ సూపర్‌ స్పెషాలిటీ టిమ్స్‌ ను 1000 పకడల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఆ ఆసుపత్రికి అనుబంధంగా మెడికల్‌ కాలేజీతోపాటు, నర్సింగ్‌ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

గాంధీ, నిమ్స్‌, ఉస్మానియాలపై తగ్గనున్న ఒత్తిడి..

నగర శివార్లలో నలు దిక్కులా నాలుగు సూపర్‌ స్పెషాల్టి ఆస్పత్రులు నిర్మాణం అయితే పెద్ద సంఖ్యలో రోగులకు వైద్య సేవలు అందిస్తోన్న గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ లపై ఒత్తిడి తగ్గనుంది. గచ్చిబౌలి, అల్వాల్‌, సనత్‌ నగర్‌, ఎల్బీనగర్‌లలో నిర్మించే ఈ ఆస్పత్రుల నిర్మాణం వల్ల జిల్లాల నుంచి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించవచ్చు. అల్వాల్‌లో ఏర్పాటు చేసే ఆసుపత్రికి సంగారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి వచ్చే రోగులు చక్కటి వైద్యం పొందే అవకాశం ఉంది. ఎల్బీనగర్‌ టిమ్స్‌ ఆస్పత్రికి.. ఖమ్మం, నల్గొండ, సూర్యపేట జిల్లాల నుంచి వచ్చే రోగులు వైద్యం పొందే వీలుంది. అదే రీతిలో గచ్చిబౌలి, సనత్‌ నగర్‌ ఆస్పత్రులకు వచ్చే రోగులకు కూడా నాణ్యమైన వైద్య సేవలు అందనున్నాయి.

గతంలో ఏదైనా అత్యవసర వైద్య సేవలు కావాలంటే నిమ్స్‌ కో, గాంధీకో తరలించాల్సిన పరిస్థితి ఉండేది. ట్రాఫిక్‌ కారణంగా అందాల్సిన వైద్యం సకాలంలో అందక రోగులు చనిపోయిన సందర్బాలు ఉన్నాయి. నగరం నలుదిక్కులా సూపర్‌ స్పెషాల్టి ఆసుపత్రుల నిర్మాణం పూర్తయితే జిల్లాల నుంచి అత్యవసర వైద్య సాయం కావాల్సిన రోగులకు ట్రాఫిక్‌ బెడద లేకుండా నగర శివార్లలోనే అత్యుత్తమ, అత్యవసర వైద్య సేవలు అందించే అవకాశం కలుగుతోంది. దీంతో పాటు గాంధీ, నిమ్స్‌, ఉస్మానియా ఆసుపత్రులకు రోగుల ఒత్తిడి తగ్గుతుంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement