ఎస్ పీ చీఫ్..యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ని కలిశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ సమావేశంలో కేజ్రీవాల్ వెంట పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో పాటు ఇతర ఆప్ నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తమ పోరాటానికి కలిసి రావాలని ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్‌ను కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీ అధికారాలను నిర్వీర్యం చేసేలా కేంద్రం వ్యవహరిస్తోందని నేతలు పేర్కొన్నారు. ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేస్తామని వెల్లడించిన కేజ్రీవాల్ ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేలను కలిసి మద్దతు కోరారు.
కాగా, అంతకుముందు యోగి ఆదిత్యానాథ్ సారధ్యంలోని యూపీ సర్కార్‌పై ఎస్‌పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు. కాషాయ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడితప్పాయని మండిపడ్డారు. రౌడీలు, గూండాలు చెలరేగుతుంటే అల్లరి మూకలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని దుయ్యబట్టారు. కన్నౌజ్‌లో ఓ ఎంపీ తన గూండాలతో వెళ్లి ఔట్‌పోస్టులో ఉన్న పోలీసులందరినీ కొట్టినా యోగి సర్కార్ ప్రేక్షక పాత్రకు పరిమితమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పని మరెవరో చేసి ఉంటే, ఈ ప్రభుత్వం బుల్డోజర్లతో నేరగాళ్ల ఇండ్లను నేలమట్టం చేసేదని అన్నారు. ఎంపీ ఇంటి వద్ద ప్రభుత్వం బుల్డోజర్లను ఎందుకు తరలించడం లేదని యోగి సర్కార్‌ను అఖిలేష్ నిలదీశారు. న్యాయం చేయాలంటూ ఢిల్లీలో మహిళా రెజ్లర్లు గొంతెత్తి అలసిపోయారని, వారు నిరసనలతో గళమెత్తినా మోదీ సర్కార్ నోరు మెదపడం లేదని ఎస్‌పీ చీఫ్ కాషాయ పాలకుల తీరును దుయ్యబట్టారు.