తెలంగాణ ఉద్యమ నేత, ప్రొఫెసర్ హరగోపాల్‌తో పాటు మరికొంతమందిపై పోలీసులు పెట్టిన దేశ ద్రోహం (యూఏపీఏ), చట్ట విరుద్ధ కార్యకలాపాల యాక్ట్ 1967 కింద కేసు నమోదైంది. మావోయిస్టులతో లింకులున్నాయనే కారణంగా ప్రొఫెసర్ హరగోపాల్‌తోపాటు మరికొంత మందిపై ఈ కేసును ములుగు జిల్లా పోలీసులు నమోదు చేశారు. అయితే.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సీఎం కేసీఆర్ పరిశీలించారు. హరగోపాల్ తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్నారని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఆయన పాత్ర ఎనలేనిదని సీపీఐ నేత కె. నారాయణ సీఎం కేసీఆర్‌కు సూచించారు.
దీంతో ప్రొఫెసర్ హరగోపాల్‌తో పాటు మిగతా వారిపైనా కేసు విత్ డ్రా చేయాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌కు సూచించారు. దీంతో ఇవ్వాల ములుగు జిల్లా ఎస్పీ ఈ కేసును ఎత్తివేస్తున్నట్టు తెలిపారు. హరగోపాల్‌తోపాటు మరో ఆరుగురిపై కేసు తొలగించారు. ఇందులో హరగోపాల్, పద్మజాషా, అడ్వొకేట్ రఘునాథ్, గడ్డం లక్ష్మణ్, గుంటి రవీంద్రపై కేసు ఎత్తేసినట్టు ములుగు ఎస్పీ గౌస్ ఆలం ఇవ్వాల (శనివారం) సాయంత్రం వెల్లడించారు. ఈ విషయమై కోర్టులో మెమో దాఖలు చేయనున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వీరిపై ఉపా కేసు తొలగిస్తున్నట్టు తెలిపారు.