సీఎం కేసీఆర్ రేపు, ఎల్లుండి పర్యటించే టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఆయా జిల్లాల ఉన్నతాధికారులకు దీనికి సంబంధించిన ఆదేశాలు అందాయి. ఇవ్వాల (శనివారం) హనుమకొండ జిల్లాకు రోడ్డు మార్గం ద్వారా చేరిన ముఖ్యమంత్రి రాత్రికి అక్కడే కెప్టెన్ లక్షీకాంతరావు ఇంట్లో బస చేయనున్నారు. ఇక.. రేపు (ఆదివారం) ఉదయం 7 గంటలకు హెలిక్యాప్టర్ ద్వారా బయలుదేరి.. 7.45కు భద్రాచలం, కొత్తగూడెం జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేస్తారు. 9.30కి భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం నుంచి బయలుదేరి 9.45కి ఏటూరు నాగారం, ములుగు జిల్లా పరిధిలోని వరద ఎఫెక్టివ్ ప్రాంతాలను పరిశీలిస్తారు. అయితే.. ఈ రెండు చోట్ల కూడా అధికారులతో భేటీ అయ్యి… సహాయక చర్యలపై సమీక్ష చేయనున్నారు.
ఇక.. 11 గంటలకు ఏటూరునాగారం నుంచి బయలుదేరి 11.45కు సికింద్రాబాద్లోని బేగంపేటకు చేరుకుంటారు. ఆ తర్వాత మహంకాళి అమ్మవారి బోనాల ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష ఉంటుంది. మరుసటి రోజు (సోమవారం) గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇతర జిల్లాల్లో పరిస్థితులపై సమీక్ష చేయనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూలు తర్వాత రిలీజ్ చేస్తామని అధికారులు తెలిపారు.