Saturday, November 23, 2024

స్పీడ్ పెంచిన సీఎం కేసీఆర్.. నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనలో స్పీడ్ పెంచారు. ఇప్ప‌టికే జ‌న‌గామ, య‌దాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌టించి అక్క‌డ బ‌హిరంగ స‌భ‌ల్లోనూ పాల్గొన్నారు. నిన్న ముంబై ప‌ర్య‌ట‌నలో మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వ‌ర్ ను క‌లిసి దేశ రాజకీయాలపై చ‌ర్చించారు. తాజాగా ఇప్పుడు మళ్లీ జిల్లాల బాట పడుతున్నారు. నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌టించ‌నున్నారు.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం నారాయణఖేడ్‌ పట్టణానికి చేరుకొంటారు. రూ.4,427 కోట్లతో నిర్మించనున్న సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే నిర్వహించనున్న బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

కాగా, సంగారెడ్డి జిల్లాలో మేజర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు లేక సాగు, తాగు నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారు. మల్లన్నసాగర్‌ నుంచి సింగూరుకు జలాలను తరలించే ప్రక్రియను చేపట్టారు. అక్కడి నుంచి సంగారెడ్డి, జహీరాబాద్‌, అందోలు, నారాయణఖేడ్‌ నియోజకవర్గాలకు నీటిని అందించేందుకు సంగమేశ్వర, బసవేశ్వర పథకాలను మంజూరు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement