తమిళనాడు పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యక్తులను కలుస్తున్నారు. నిన్న తమిళనాడు సీఎం స్టాలిన్ తో సమావేశం అయిన కేసీఆర్.. ఈరోజు మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత, నటుడు కమల్ హాసన్ భేటీ అవనున్నారు. కమల్ హాసన్‌తో కేసీఆర్ రాజకీయ అంశాలపై చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం.
మరోవైపు నిన్న(డిసెంబర్ 14) తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీ అయిన కేసీఆర్.. కేంద్రం అవలంబిస్తున్న విధానాలు, ప్రాంతీయ పార్టీలతో ప్రజలకు కలిగే ప్రయోజనాలపై మాట్లాడారు. ముఖ్యమంత్రులిద్దరూ ఏకాంతంగా గంట సేపు చర్చించుకొన్నారు. ఈ భేటీలో జాతీయ రాజకీయాలపై మాట్లాడుకొన్నట్టు సమాచారం. కేంద్ర వ్యవసాయ విధానాలు సరిగా లేవని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని చర్చించుకొన్నట్టు తెలుస్తోంది. జాతీయ పార్టీలకు జాతీయ విధానాలే లేవని, ప్రాంతీయ పార్టీలకే ప్రజలపై శ్రద్ధ ఉన్నదని, అందుకే ప్రజలు వాటినే ఆదరిస్తున్నట్టు కేసీఆర్ వ్యాఖ్యానించటన్లు సమాచారం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను విశ్లేషించి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై సమాలోచనలు చేసినట్లు తెలిసింది.