దళితజాతి దశాదిశ మార్చే లక్ష్యంతో ఓ చారిత్రక పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది. పంట పెట్టుబడితో రైతులను తలెత్తుకునేలా చేసిన రైతు బంధుకు వేదికైన ఉద్యమాల హుజూరాబాద్ గడ్డపై ‘దళిత బంధు’కు అంకురార్పణ చేయబోతున్నది. దళిత బంధు పథకాన్ని సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. శాలపల్లి- ఇందిరానగర్ లో సోమవారం జరిగే సీఎం సభకు సర్వం సిద్ధం చేశారు. సభా ప్రాంగణంలోని స్టేజీపై సుమారు 250 మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సీఎం సభ జరుగనుంది.
ఆర్థిక, సామాజిక భద్రత కల్పించి దళితులు ఆత్మగౌరవంతో బతికేలా చేయాలన్న ఉదేశ్యంతో ఈ పథకాన్ని సీఎం ప్రారంభిస్తున్నారు. దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద హుజురాబాద్ లో అమలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం కింద.. ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ప్రారంభించినప్పటికీ.. పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో దీనిని అమలు చేయనున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ శాలపల్లి-ఇందిరానగర్ వద్ద దళితబంధును ప్రారంభించనున్నారు. ఇందుకోసం రూ. 500 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేశారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 20,929 దళిత కుటుంబాలు ఉన్నాయి. ఇందులో అర్హులైన ప్రతి కుటుంబానికి దళిత బంధు అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో సర్వే కూడా చేశారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో సభ లు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అధికారులు చెబుతున్నారు.
30 ఎకరాల్లో సభా స్థలాన్ని ఏర్పాటు చేశారు. సీఎం సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ పాసులు, కొవిడ్ నిబంధనల మేరకు మాస్కులు కూడా ఇవ్వనున్నారు. జనాలు సభకు వచ్చేందుకు 825 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. బస్సులే కాకుండా ఇతర వాహనాలు కూడా భారీ గా తరలి రానుండగా, రెండు ప్రాంతాల్లో 14 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ మార్గంలో వచ్చే వాహనాలకు సాయి డెవలపర్స్ ప్రాంతంలో ఎస్సారెస్పీ కాలువ దాటిన తర్వాత 4 చోట్ల, ఇక జమ్మికుంట మార్గంలో వచ్చే వాహనాలకు లిడ్ క్యాప్ స్థలం వద్ద అయ్యప్ప ఆలయం వెనక, బాలాజీ బ్రిక్స్ కంపెనీ ప్రాంతంలో మరో 10 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి దాదాపు 1.20 లక్షల మంది దళితులు, టీఆర్‌ఎస్ శ్రేణులు తరలివస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన ‘సింహ గర్జన’ సభ మొదలకొని, తాను ఎంతగానో అభిమానించిన ‘రైతు బీమా’ పథకం దాకా కరీంనగర్ జిల్లా నుంచే సీఎం ప్రారంభించారు. అదే విధంగా ప్రతిష్టాత్మకమైన ‘రైతుబంధు’ పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు. అదే ఆనవాయితీని సీఎం సెంటిమెంటును కొనసాగిస్తూ ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్నిమండలాల్లోని దళిత కుటుంబాల వివరాల స్థితిగతులను ఇప్పటికే తెలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా నిర్ణయించిన ప్రకారమే తెలంగాణ దళిత బంధు పథకం రూ. 1200 కోట్లతో అమలవుతుందని సీఎం తెలిపారు. అయితే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున అధనంగా మరో రూ.1500 నుంచి 2000 కోట్ల రూపాయలను పైలట్ నియోజకవర్గమైన హుజూరాబాద్ లో ఖర్చు చేయనున్నట్టు ఇప్పటికే సీఎం ప్రకటించారు.