Tuesday, November 26, 2024

సీఎం కేసీఆర్ ఆకస్మిక తనిఖీలు.. ఎప్పుడంటే..

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు. పల్లె, పట్టణ ప్రగతి పనులను ఆయన తనిఖీ చేయనున్నారు. రాష్ట్రంలో పట్టణ ప్రగతి అమలుపై శుక్రవారం సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి తీరును.. పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ అధికారుల పనితీరును పరిశీలించేందుకు జూన్ 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలను తానే స్వయంగా చేపడుతానని సీఎం కేసీఆర్ ప్రకటించారు.   ఉద్యోగులు ఏమాత్రం అలసత్వానికి తావివ్వకూడదన్నారు. రెండేళ్లు గడిచాయని.. ఇక రంగంలోకి దిగక తప్పదని స్పష్టం చేశారు. పనుల్లో అలసత్వం వహించిన ఏ స్థాయి అధికారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. త్వరలో అధికారుల పనితీరు పరిశీలిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.

సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు చర్యలను సిద్ధం చేసుకునే చార్టును రూపొందించుకోవాలని సీఎం సూచించారు. ప్రతీ సీజన్లో ముందస్తు ప్రణాళిక సంస్కృతిని అన్ని శాఖల యంత్రాంగం అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ నెల 13న అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, డీపీవోలతో సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్ వెల్లడించారు. అదనపు కలెక్టర్లు, డీపీవోలతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. సీజనల్‌ వ్యాధుల కట్టడికి అధికారులు ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 4.7 శాతానికి పడిపోయిందన్నారు.
రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు అటవీశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. కరోనా పూర్తిగా తగ్గాక మరో విడత పల్లె, పట్టణ ప్రగతి పర్యటన నిర్వహిస్తామన్నారు. పచ్చదనం పెంచడానికి ప్రత్యేక కార్యాచరణ చేపడతామని.. గ్రామాలు, మున్సిపాటిటీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement