కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రగతి భవన్ చేరుకున్నారు. కరోనా నివారణ చర్యలు, ఇతర అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 19న సీఎం కేసీఆర్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలుండటంతో వైద్యుల సూచన మేరకు ఆయన గజ్వేల్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్‌లో ఉన్నారు. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్టు ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 21 రోజుల తర్వాత సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు చేరుకున్నారు.
మరోవైపు సీఎం కేసీఆర్ హైదరాబాద్ రావడంతో కరోనాపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కరోనా తాజా పరిస్థితి, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై సీఎం అధికారులతో చర్చించనున్నారు. ఈటల రాజేందర్ నుండి వైద్య ఆరోగ్యశాఖను తనకు బదాలాయించుకున్న సీఎం కేసీఆర్ మొదటిసారి అధికారికంగా సమీక్ష నిర్వహించనున్నారు. అయితే కరోనాపై హైకోర్టు సిరియస్ అవుతున్న నేపథ్యంలోనే కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల తోపాటు వారంతపు లాక్ డౌన్‌పై కూడ చర్చించనున్నట్టు సమాచారం.
కాగా, సీఎం కేసీఆర్ కి ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు ఆధ్వర్యంలోని వైద్య బృందం మంగళవారం (మే4) కొవిడ్ పరీక్షలు నిర్వహించింది. ర్యాపిడ్ యాంటిజెన్ తోపాటు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. రక్తపరీక్షల రిపోర్టులు కూడా సాధారణంగా ఉన్నట్టు తేలింది. దీంతో సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకొన్నట్టు వైద్యులు నిర్ధారించారు.