Saturday, November 23, 2024

ఎస్సీల బాధ‌లు పోవాలి.. ఏం చేయాలో చెప్పండి: విపక్షాలకు కేసీఆర్ పిలుపు

ఎస్సీల అభివృద్ధి కోసం ద‌శ‌ల‌వారీగా కార్యాచ‌ర‌ణ అమ‌లుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉన్న‌ట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప‌థ‌కం విధివిధానాల రూప‌క‌ల్ప‌న‌పై సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న అఖిల‌ప‌క్ష భేటీ జ‌రిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ స‌మాజ అభివృద్ధిలో ప్ర‌భుత్వాల‌దే కీల‌క పాత్ర‌ అని అన్నారు. ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యం వ‌హిస్తే రేప‌టి త‌రాలు న‌ష్ట‌పోతాయని చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుక‌బ‌డిన ఎస్సీల బాధ‌లు పోవాలన్నారు. స‌మాజాన్ని ముందుకు న‌డిపించడంలో ప్ర‌భుత్వాల‌ది చంటి పిల్లలను పెంచి పోషించే పాత్ర అని పేర్కొన్నారు.

క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు ఏ ఊరికి వెళ్లినా సామాజికంగా, ఆర్థికంగా దళితులే పీడిత వ‌ర్గాలు అని తెలిపారు. ఎస్సీల్లో ఆత్మ‌స్థైర్యం నింపేందుకు ఏం చేయాలో సూచించాల్సిందిగా కోరారు. ద‌ళితుల‌కు సామాజిక, ఆర్థిక బాధ‌లు తొల‌గిపోవాలంటే ఏం చేయాలో ద‌శ‌ల‌వారీగా కార్యాచ‌ర‌ణ అమ‌లుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. తాము కూడా పురోగ‌మించ‌గ‌లం అనే ఆత్మ‌స్థైర్యంతో ద‌ళిత స‌మాజం ముందుకెళ్లేందుకు ఏం చేయాలో సూచ‌న‌లు చేయాల‌న్నారు. ద‌ళిత సాధికార‌త‌కు పైర‌వీల‌కు ఆస్కారం లేని పార‌ద‌ర్శ‌క విధానాన్ని అమ‌లు ప‌రుద్దామ‌ని చెప్పారు. నిధుల బాధ్య‌త త‌నద‌ని తెలిపారు. పార్టీలు, రాజ‌కీయాల‌కు అతీతంగా స‌మిష్టి కార్యాచ‌ర‌ణ చేప‌ట్టే బాధ్య‌త తామంతా తీసుకుందామ‌న్నారు.

కాగా, ఈ సమావేశానికి రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీల సంక్షేమం, వయో వృద్దుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మధిర ఎమ్మెల్యే, కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ లో టీ.పీసీసీ అగ్గి.. రాజీనామా బాటలో సీనియర్లు!

Advertisement

తాజా వార్తలు

Advertisement