తెలంగాణలోని ఒక్కో నియోజకవర్గంలో 100 మందికి దళిత బంధు అందజేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకే అప్పగిస్తున్నామని తెలిపారు. వచ్చే మార్చిలో రూ. 20 వేల కోట్లు బడ్జెట్లో పెడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రూ.10 లక్షలు లబ్ధిదారుల ఇష్టమని, నిబంధనలు లేవని, ఎక్కడైనా వ్యాపారం పెట్టుకోవచ్చునని తెలిపారు. తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
ఇప్పటికీ దళితజాతి అట్టడుగుస్థాయిలోనే ఉందన్నారు దేశంలోని సామాజిక వివక్ష వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. దళిత జాతి అవకాశాలు లేక సతమతం అవుతోందన్న సీఎం.. వివక్ష జరుగుతోందన్నారు. ఏడాది కిందటే దళితబంధు పథకం ప్రారంభం కావాల్సిందని తెలిపిన కేసీఆర్.. అయితే కరోనా వల్లే ఆలస్యమైందని తెలిపారు. దళితబంధుపై అఖిలపక్షం సమావేశం పెట్టి చర్చించామని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. వర్గీకరణ చేయాలని ఇప్పటికే ప్రధానికి చాలాసార్లు చెప్పానని తెలిపారు. రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంలో ఉన్నారన్న సీఎం కేసీఆర్.. వర్గీకరణ చేసి తీసుకువస్తే.. బేగంపేట నుంచి పెద్ద పెద్ద దండలు వేసి స్వాగతం పలుకుతామన్నారు.