గ్రీనరీలో ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మొదటి స్థానంలో కెనడా, రెండో స్థానంలో బ్రెజిల్, మూడో స్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు. యూఎన్‌వో కూడా తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని గుర్తించి ప్రశంసించింది అని సీఎం గుర్తు చేశారు. శుక్రవారం శాసనసభలో హరితహారంపై స్వల్పకాలిక చర్చ చేపట్టిన సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
తెలంగాణకు హరితహారం మరింత సమర్థవంతంగా నిర్వహణకు హరిత నిధి ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. పచ్చదనం పెంపు పట్ల ప్రతీ ఒక్కరు తమ బాధ్యత, పాత్ర పోషించేలా చొరవ అని… తెలంగాణ హరిత నిధి ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల జీతాల నుంచి నెలకు రూ. 500, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ప్రతీ నెలా 100 రూపాయల విరాళం ఇవ్వాలన్నారు. అలాగే… ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి నుంచి నెలకు రూ.25 ఇవ్వాలని కోరారు. రిజిస్ట్రేషన్లు, భవనాలు అనుమతులు, వాహన రిజిస్ట్రేషన్ల సమయంలో కొద్ది మొత్తం వసూలు చేయాలని వెల్లడించారు. విద్యార్థుల అడ్మిషన్ల సమయంలో ఒక్కొక్కరికి ఐదు రూపాయలు, అలాగే… స్వచ్ఛందంగా ముందుకు వచ్చే సంస్థలు, వ్యక్తుల నుంచి విరాళాల సేకరణ చేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు.
”మన దేశంలోనే అత్యంత నిరాదరణకు గురైన రంగం అటవీ రంగం. దీని కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. వర్షాలు తగ్గిపోయాయి. కరువులు వచ్చాయి. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ గమనిస్తుంటారు. భవిష్యత్ తరాలకు ప్రమాదం, నష్టం జరగకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తుంటారు. పర్యావరణ సమతులత్యత పెంచడం, గ్రీనరీని పెంచడం వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. న్యూజిలాండ్‌లో ఓ పార్టీ పేరే గ్రీన్ అని ఉంది. ఆ పార్టీ సృష్టించిన అవగాహన వల్ల అక్కడ పర్యావరణ సమతుల్యత దెబ్బతినలేదు. గ్రీనరీ పెంచడమే లక్ష్యంగా గ్రీన్ అని పార్టీకి పేరు పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. సామాజిక అడవులతో అనేక ప్రయోజనాలుంటాయి. జీడీపీలు, జీఎస్‌డీపీలు పెంచినా, వ్యక్తులు తమ ఆస్తులు పెంచినా.. జీవించలేని పరిస్థితులు లేకపోతే ఏం చేయగలం. కాబట్టి దీనిపై ప్రతి ఒక్కరూ దృష్టిసారించాలి. తెలంగాణ రాష్ట్రంలో గ్రీనరీని పునరుద్ధించాలనే ఉద్దేశంతో.. ఈ సబ్జెక్టుపై సమీక్ష చేశాను. పచ్చదనం తగ్గిపోవడం, పరిస్థితులు మారిపోవడం, వాతావరణ పరిస్థితులు ప్రతికూలించడం.. వీటిని పునరుద్ధరించడం కోసం అనేక ప్రయత్నాలు ఉంటాయి. అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవాలంటే మొక్కలు నాటాలి. మొక్కలు నాటడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోవచ్చు” అని సీఎం కేసీఆర్ చెప్పారు.
ఇది కూడా చదవండి: Huzurabad by election: గెల్లు శ్రీనివాస్ నామినేషన్