మాజీ మంత్రి ఈటెల వ్యవహారంపై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీపై, తనపైన ఎదురుదాడి చేయడంతో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపైన సీనియర్ నేతలతో కేసీఆర్ మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈటెల వ్యవహారం పై టీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ సంఘం దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. పార్టీ పరంగా ఈటెలపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కాగా, మెదక్ జిల్లాలోని మూసాయిపేటలో రైతుల భూములను ఈటెల కబ్జా చేశారన్న నేపధ్యంలో మంత్రి పదవి నుంచి ఈటెలను తొలిగిస్తూ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మంత్రి పదవి తొలిగింపు అనంతరం నిన్న మీడియాతో మాట్లాడిన ఈటెల టీఆర్ఎస్ పైన, కేసీఆర్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. కారు గుర్తు మీద గెలిచామని మీరంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమేనని ప్రకటించారు. తన రాజకీయ జీవితం తెరిచినా పుస్తకమని, 19ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతిరహిత నాయకుడిగా పేరు సంపాదించుకున్నానని తెలిపారు. ఉద్యమ సమయంలో ప్రలోభ పెట్టిన లొంగలేదని, పార్టీకి, ప్రభుత్వానికి ఏనాడూ మచ్చ తెచ్చే ప్రయత్నం చేయలేదని చెప్పారు. ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న ఏ ఒక్క మంత్రి కూడా ఆత్మగౌరవంతో ఉన్నామని చెప్పుకోలేరని వ్యాఖ్యానించారు. ఈటల వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఆయన పైన పార్టీ పరంగా చర్యలు తీసుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, పార్టీ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ ఈటలకు కౌంటర్ ఇచ్చారు. ఈటల రాజేందర్ ఒక మేకవన్నె పులి, బలహీన వర్గాల ముసుగులో ఉన్న పెద్ద దొర అంటూ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. ఈటలను అన్ని విధాల కేసీఆర్ గౌరవించి ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ సహా కీలక మంత్రిత్వశాఖలు ఇచ్చారని తెలిపారు.