Monday, November 18, 2024

1500 కోట్లతో పర్యాటక క్షేత్రం.. మల్లన్నసాగర్‌ వద్ద ఏర్పాటుకు కసరత్తు

మల్లన్నసాగర్‌ ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మల్లన్నసాగర్‌ జలాశయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన మేరకు సమగ్రమైన ప్రణాళికల రూపకల్పనకు చర్యలు ప్రారంభించింది. ‘మల్లన్నసాగర్‌ ఆ పక్కనే యాదాద్రి, ఈ పక్కన కొమురెల్లి మల్లన్న ఆలయం.. చుట్టూ ఆకుపచ్చదనంతో అలరారే ప్రాంతమిది. కనువిందుచేసే సౌందర్యాలున్నాయి. వీటితోపాటు కొండపోచమ్మ , బస్వాపూర్‌.. అన్నీ హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి అద్భుతమైన టూరిజం హబ్‌ను ఏర్పాటు చేయాలి. ఇందుకోసం రూ.1500 కోట్లను మంజూరు చేస్తున్న’ అని బుధవారం ముఖ్యమంత్రి ప్రకటించారు.

రాష్ట్రంలో ఉన్న రిజర్వాయర్లన్నీ కూడా చక్కని పర్యాటక ప్రాంతాలుగా దేశవిదేశీ టూరిస్టులను ఆకర్షించాలని, సినిమా షూటింగ్‌లు సైతం జరిగేలా అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. గురువారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. మల్లన్నసాగర్‌ టూరిజం ప్రణాళికపై మంత్రి.. సీఎం కేసీఆర్‌తో విస్తృతంగా చర్చించినట్టు సమాచారం. మల్లన్నసాగర్‌తోపాటు.. ఇతర రిజర్వాయర్ల దగ్గర పర్యాటక అభివృద్ధిపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేసినట్టు తెలిసింది. సీఎం కేసీఆర్‌ మార్గదర్శనంలో ఏడాదిన్నర లోగా పర్యాటక ప్రాజెక్టును పూర్తిచేయడానికి పర్యాటకశాఖ చర్యలు చేపట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement