తెలంగాణలో జులై 1వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, హరితహారంపై సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. శనివారం ప్రగతిభవన్ లో కలెక్టర్లు, అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. జులై 1 నుంచి అమలు చేసే పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై చర్చించారు. ముఖ్యంగా, ఏడో విడత హరితహారం కార్యక్రమంలో అందుకోవాల్సిన లక్ష్యాలను నిర్దేశించారు. గ్రామాల్లో ఇంటింటికీ 6 మొక్కలు చొప్పున పంపిణీ చేయాలని తెలిపారు. నిర్దేశించిన ఏ పనీ పెండింగ్‌లోఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ప్రజలను చైతన్యపరిచి శ్రమదానంలో పాల్గొనేలా చేయాలని సూచించారు.
కల్తీ విత్తనాల అమ్మకాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అపరిష్కృతంగా ఉన్న పనులపై అధికారులు పునఃసమీక్ష చేయాలని సూచించారు. రాష్ట్రంలో మిల్లుల సంఖ్యను పెంచేందుకు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు ప్రభుత్వ యంత్రాంగం అండగా నిలవాలని తెలిపారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలను తొలగించడానికి కృషి చేయాలన్నారు. రాష్ర్టానికి అదనపు రైస్ మిల్లులు అవసరం ఉందన్నారు. రైస్ మిల్లుల సంఖ్యను పెంచి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. 250 ఎకరాల్లో ఒక్కో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ ఏర్పాటు చేయాలన్నారు. సెజ్‌ల చుట్టూ బఫర్ జోన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బఫర్ జోన్ల పరిధిలో లేఔట్లు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దన్నారు.
పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రజావసరాలకు కేటాయించిన భూమిని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేశారు. రికార్డుల్లో ఉన్న 66 లక్షల ఎకరాల అటవీ భూముల హద్దులను నిర్దిష్టంగా గుర్తించాలని సీఎం ఆదేశించారు.
ఇదీ చదవండి: వెదర్ అలర్ట్: తెలంగాణలో రేపు భారీ వర్షాలు