Saturday, November 16, 2024

ఈటెల భూ కబ్జా వ్యవహారంలో సీఎంకు మరో ఫిర్యాదు

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జా వ్యవహారంలో సీఎం కేసీఆర్ కు మరో ఫిర్యాదు అందింది. ఈటెల రాజేందర్ కుమారుడు ఈటెల నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారనీ,తనకు న్యాయం చేయాలని కోరుతూ, మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేష్ ముదిరాజ్ అనే వ్యక్తి సీఎం కెసిఆర్ కు ఫిర్యాదుతో కూడిన దరఖాస్తు చేశారు. తనకందిన ఫిర్యాదు మేరకు తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఏసీబీ విజిలెన్స్ శాఖ, రెవెన్యూ శాఖ, రెండు శాఖలు సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

కాగా, మాజీ మంత్రి ఈటల భూకబ్జాపై గత కొద్ది రోజులుగా అధికారులు విచారణ చేస్తున్నారు. జ‌మున హ్యాచ‌రీస్ కోసం పేద‌లను, అధికారుల‌ను బెదిరింపుల‌కు గురిచేసి వంద‌ల ఎక‌రాలు ఆక్ర‌మించిన‌ట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈటల భూ ఆక్ర‌మ‌ణ‌ల‌పై బాధిత రైతులు నేరుగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కే ఫిర్యాదు చేశారు. త‌మ అసైన్డ్ భూముల‌ను మంత్రి ఈట‌ల రాజేంద‌ర్, ఆయ‌న అన‌యాయులు ఆక్ర‌మించుకుంటున్నారంటూ లేఖ ద్వారా బాధిత రైతులు సీఎంకు ఫిర్యాదు చేశారు. ఈటల భూకబ్జాపై రైతులు చాకలి లింగయ్య, చాకలి బిచ్చవ్య, చాకలి కృష్ణ, చాకలి నాగులు, చాకలి పరుశురాం, ఎరుకల ఎల్లయ్య, ఎరుకల రాములు ఫిర్యాదు చేశారు.

మంత్రి ఈట‌ల భూదాహాన్ని మెద‌క్ జిల్లా రిటైర్డ్ క‌లెక్ట‌ర్ ధ‌ర్మారెడ్డి వెలుగులోకి తెచ్చారు. మెద‌క్ జిల్లా మాసాయిపేట మండ‌లంలో మంత్రి భూ ఆక్ర‌మ‌ణ‌లకు పాల్పడిన‌ట్లుగా తెలిపారు. అచ్చంపేట‌, హ‌కీంపేట్ గ్రామాల్లో 100 ఎక‌రాలు భూ క‌బ్జా చేసిన‌ట్లు చెప్పారు. 130/5, 130/10, 64/6 స‌ర్వే నెంబ‌ర్ల‌లో గ‌ల భూమిని మంత్రి క‌బ్జా చేశాడ‌న్నారు. రిజిస్ట్రేష‌న్ కుద‌ర‌ద‌న్నా అధికారుల‌పై ఒత్తిడి తెచ్చి భార్య జ‌మున‌, కొడుకు నితిన్‌రెడ్డి పేరుతో అసైన్డ్ భూములను రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నార‌న్నారు.

క‌బ్జా చేసిన భూముల్లో హ్యాచ‌రీస్ కోసం షెడ్ల నిర్మాణం చేప‌ట్టిన‌ట్లు బాధిత రైతులు తెలిపారు. ప్రశ్నిస్తే త‌మ భూముల‌కు దారిలేకుండా చేస్తామంటూ బెదిరింపుల‌కు గురిచేసిన‌ట్లు చెప్పారు. భూమి పత్రాలను సైతం దౌర్జన్యంగా లాక్కున్నారన్నారు. మాసాయిపేట మండ‌లం అచంపేట్‌, హ‌కీంపేట్ గ్రామాల్లోని 100 ఎక‌రాల‌ను మంత్రి ఇప్ప‌టికే ఆక్ర‌మించిన‌ట్లు తెలిపిన రైతులు ఇందులో ప‌దుల ఎక‌రాల‌ను ఈటల కుటుంబీకుల‌ పేరుతోనే రిజిస్ట్రేష‌న్ చేసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈటెల‌తో పాటు ఆయ‌న అనుచ‌రులు సూరి అలియాస్ అల్లి సుద‌ర్శ‌న్‌, యంజాల సుధాక‌ర్‌రెడ్డిలు క‌బ్జా కాండ సాగిస్తున్నార‌ని గ్రామ‌స్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అసైన్డ్ భూముల‌ను ప్ర‌భుత్వం తిరిగి స్వాదీనం చేసుకోబోతుంద‌ని బెదిరిస్తూ ఆక్ర‌మణ‌కు య‌త్రిస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement