నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇవాళ హాలియాలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ కేంద్రమైన హాలియాలో సాయంత్రం 6 గంటలకు సభ ప్రారంభం కానుంది. సీఎం హెలికాప్టర్ ద్వారా సాగర్‌కు 5 గంటలకు చేరుకుంటారు. సాగర్ నుంచి రోడ్డు మార్గంలో సభాస్థలికి చేరుకుంటారు. బహిరంగ సభకు టీఆర్‌ఎస్ అన్ని ఏర్పాట్లు చేసింది. హాలియా పట్టణంలోని పెద్దవూర రోడ్డులో పాత ఐటీఐకి ఎదురుగా ఉన్న 20 ఎకరాల స్థలంలో సభను నిర్వహిస్తున్నారు. బహిరంగ సభలో సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. గడిచిన ఏడేళ్ల కాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన వివిధ పథకాలను ప్రజలకు వివరించే అవకాశం ఉంది. ఈ వేదికగా ప్రత్యర్థి పార్టీలపై కేసీఆర్ విరుచుకుపడే అవకాశం ఉంది.
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా మారడంతో సీఎం బహిరంగ సభను అధికార పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. లక్ష మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. వీరితోపాటు టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. కొవిడ్ నిబంధనల మేరకు సభ వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలను మాస్క్‌లు ధరించి రావాలని పార్టీ శ్రేణులు సూచించాయి. సభాప్రాంగణం వద్ద మాస్క్‌లు, శానిటైజర్లను పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంచారు.
కాగా, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్‌ఎస్ తమ పొలాల్లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న సభను ఆపేలా ఆదేశించాలంటూ రైతులు గోలి సైదిరెడ్డి, గోలి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం దాఖలుచేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌ను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి (సీజీ) నిరాకరించారు. వీరి అభ్యర్థనను సీజే తిరస్కరించినట్టు
ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తరుపున మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేశారు. అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయండి అంటూ అభ్యర్థించారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గెలిచినా ఉపయోగం లేదని విమర్శలు గుర్పించారు. కాగా, ఏప్రిల్ 17న సాగర్ ఉప ఎన్నిక జరగనుంది.