Saturday, November 9, 2024

మంత్రి ఈటలపై విచారణ.. రాష్ట్రంలో పెను సంచలనం

తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తమ అసైన్డ్‌ భూములు కబ్జా చేశారంటూ కొంతమంది రైతులు నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేయగా ఆయన వెంటనే స్పందించి దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇది రాష్ట్రంలో సంచలనంగా మారింది. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో తమకు చెందిన అసైన్డ్‌ భూములను మంత్రి కబ్జా చేశారని, ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని పేర్కొంటూ రైతులు శుక్రవారం ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు సీఎం ఆదేశించారు. ఈ ఫిర్యాదులపై కలెక్టరు ద్వారా దర్యాప్తు జరిపి నివేదిక అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే నిజానిజాలను నిగ్గుతేల్చాల్చిందిగా విజిలెన్స్‌ డీజీ పూర్ణచందర్‌రావును నిర్దేశించారు. సత్వరమే ప్రాథమిక నివేదికను అందజేసి, అనంతరం సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజేయాల్సిందిగా సీఎం స్పష్టం చేశారు.

మంత్రి ఈటల రాజేందర్‌, ఆయన అనుచరులు అక్రమంగా అసైన్డ్‌ భూములను కబ్జా చేయడంతోపాటు గ్రామస్థులను బెదిరించినట్లు మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు చెందిన 8 మంది రైతులు ముఖ్యమంత్రికి ఫిర్యాదును సమర్పించారు. ఈ ఫిర్యాదు కాపీని మంత్రి హరీశ్‌ రావు, ఎంపీ ప్రభాకర్‌ రెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌లకు కూడా పంపారు.

 ‘‘1994 సంవత్సరంలో సర్వే నంబరు 130/5, 130/9, 130/10లలో ఒక్కో కుటుంబానికి ఎకరం 20 గుంటల చొప్పున ప్రభుత్వం చాకలి లింగయ్య, బిచ్చవ్వ, కృష్ణ, నాగులు, పరశురాంలకు ఇచ్చింది. సర్వే నంబరు 64/6లో ఎరుకల దుర్గయ్యకు 3 ఎకరాలు, ఎరుకల ఎల్లయ్య, రాములుకు కొంత భూమిని అసెన్డ్‌ కింద కేటాయించింది. గత కొన్ని నెలలుగా మంత్రి ఈటల రాజేందర్‌ అనుచరులు సూరి అలియాస్‌ అల్లి సుదర్శన్‌, యాంజల సుధాకర్‌రెడ్డి మా గ్రామాలలోని అసైన్డ్‌ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ఒక పథకం ప్రకారం కబ్జాకు తెరలేపారు. ఆ పథకంలో భాగంగా ‘మీ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనపరచుకుంటుందంటూ’ మమ్మల్ని భయపెట్టి, మాతోపాటు వందమంది పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన రైతుల భూ కేటాయింపు పత్రాలను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు. మా రెండు గ్రామాల పరిధిలోని సుమారు 100 ఎకరాల అసైన్డ్‌ భూములు కబ్జాకు గురయ్యాయి. వాటిలో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండానే పెద్ద పౌల్ట్రీ పరిశ్రమ స్థాపనకు షెడ్లు నిర్మిస్తున్నారు. భూములను కబ్జా చేయడమే కాక, వారి కార్యకలాపాలకు అడ్డుపడుతున్న కొందరు పేద రైతుల భూములకు దారి ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ‘నువ్వు కూడా నీ భూమి మాకు అమ్ముకో, లేదంటే నీ భూమికి శాశ్వతంగా దారి లేకుండా చేస్తాం’ అని బెదిరిస్తున్నారు. దిక్కున్నచోట చెప్పుకోండని జులుం చేస్తున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో మాలాంటి బడుగు రైతులకు మీ వల్లే సరైన న్యాయం జరుగుతుంది. ఈటల రాజేందర్‌, ఆయన అనుచరుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న మా అసైన్డ్‌ భూములను విడిపించి, వాటిపై మాకు శాశ్వత హక్కులు కల్పించాలి’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కబ్జాల విషయం వెలుగులోకి రాగానే, ఆ భూములను రెగ్యులరైజ్‌ చేయాలంటూ మంత్రి ఈటల రాజేందర్‌ తమపై ఒత్తిడి తెచ్చారంటూ మాజీ కలెక్టర్‌ ధర్మారెడ్డి, మాజీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ నగేష్‌లు పలు టీవీ ఛానళ్లతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

మరోవైపు తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తాను ఏ భూమిని కబ్జా చేయలేదని, పక్కా ప్రణాళిక ప్రకారమే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తన హాచరీస్ కోసం రైతుల వద్ద నుంచి తీసుకున్న భూముల పత్రాలు ఇప్పటికీ ఎమ్మార్వో దగ్గరే ఉన్నాయని ఈటల తెలిపారు. వాటిని చూపించడానికి తాను సిద్ధమని చెప్పారు. ధర్మం లేకపోతే వ్యాపారంలో తాను వంద కోట్లకు ఎదిగేవాడిని కాదని అన్నారు. తన జీవితంలో ఒకరి ఆస్తిని కూడా లాక్కోలేదని, ఒకరిని కూడా ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. తనకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో కరీంనగర్ ప్రజలకు తెలుసని అన్నారు. తన భూములు పోయినా పర్వాలేదని… ఆత్మగౌరవాన్ని మాత్రం చంపుకోనని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement