ప్రజలకు వైద్యం రాను రాను అత్యంత ఖరీదుగా మారిందని, పేదలకు జబ్బు చేస్తే నయం చేయించుకోవడానికి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వ ఆధ్వర్యంలో డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్ పరీక్ష చేసి మందులు రాస్తాడు కానీ.. ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి వేల వేలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్లలో 57 పరీక్షలు ఉచితమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ మధ్యకాలంలో కరోనా వ్యాధి ఒకటి కొత్తగా జబ్బుల లిస్టులో వచ్చి చేరింది. దానికీ పలు రకాల పరీక్షలు వున్నయి. ప్రభుత్వ దవాఖానాల్లో డాక్టర్ పరీక్ష చేసి మందులు రాస్తడు కానీ పరీక్ష కోసం ఎక్కడికో ప్రయివేట్ సెంటర్లకు పోయి వేలకు వేలు ఖర్చు చేసి పరీక్షలు చేయించుకోవాల్సి వస్తున్నది. దీనివల్ల పేదలకు విపరీతమైన ఆర్ధిక భారం పడుతున్నది. కరోనా నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు ఇంకా కరోనా చికిత్స కోసం అవసరమైన ఇతర పరీక్షల కోసం కూడా పేదలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. వైద్యాన్ని అందిచడమంటే కేవలం డాక్టర్లు మందులు సూదులు మాత్రమే కాదనీ, పరీక్షలు కూడా అత్యంత ప్రధాన్యత అంశంగా ప్రభుత్వం భావించింది. ఈ మేరకు తక్షణం 19 జిల్లాల్లో డయాగ్నసిస్ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇంకా అవసరమైన చోట్ల దశల వారీగా డయాగ్నోసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం..’’ అని సీఎం తెలిపారు.