Saturday, November 23, 2024

పీకేతో సీఎం కేసీఆర్‌ భేటీ.. కొత్త పార్టీ పేరు, ఎజెండాపై సుధీర్ఘ చ‌ర్చ‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జాతీయపార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్‌ తదుపరి వ్యూహాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో భేటీ అయ్యారు. దేశానికి తెలంగాణ పథకాలు స్పూర్తిగా నిల్చినట్లుగానే కొత్త రాజకీయపార్టీ దేశానికి ఆదర్శంగా ఉండేలా వ్యూహాలను రెడీ చేస్తున్నారు. ఈ దిశలో పీకేతో సీఎం కేసీఆర్‌ విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ వారంలో రెండోసారి ఆయన పార్టీ ప్రకటనపై కీలక అభిప్రాయాలను సేకరించేందుకు ప్ర‌శాంత్ కిశోర్‌ (పీకే)తో ఆదివారం సమావేశమయ్యారు. ఈ నెల 19తర్వాత అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్ధతివ్వాలి..ఏ కూటమితో కాకుండా ఒంటరిగా పార్టీ ఏర్పాటుతో కలిసివచ్చే శక్తులు, జాతీయ స్థాయిలో పార్టీ ఎజెండా, జెండా, పార్టీ పేరు వంటి అనేక అంశాలపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ రాజకీయ వ్యూహకర్త పీకేతో చర్చించినట్లు సమాచారం.

టీఆర్‌ఎస్‌తో సంబంధం లేకుండా నేషనల్‌ పార్టీని ప్రకటించాలన్న అభిప్రాయంతోపాటు ఢిల్లిలో పార్టీని ప్రకటించే ముహూర్తంపై ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పీకేతో చర్చించినట్లు తెలిసింది. తద్వారా దేశవ్యాప్తంగా కొత్త పార్టీ పేరును చర్చనీయాంశంగా చేయడంతోపాటు, అందుకు వీలుగా ఎజెండా, దేశంలోని సమస్యలు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తీరకుండా పోయిన ప్రజా సమస్యలు, రాజకీయ, ఆర్ధిక, రక్షణ అంశాలతో కూడిన అనేక అంశాలను ప్రస్తావించడంతోపాటు, బీజేపి, కాంగ్రెస్‌ పార్టీల హయాంలో జరిగిన అల్లర్లు, మతతత్వం, కుల రాజకీయాలను ఏ కోణంలో ప్రస్తావిస్తే మంచిజరుగుతుందనే అంశాలపై సుధీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది.

త్వరలో మేధావులు, రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌లతో భేటీ నిర్వహించి వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసెఉకోవాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు తెలిసింది. ముక్త్‌ బీజేపి, ముక్త్‌ కాంగ్రెస్‌ నినాదంతో దేశంలో సరికొత్త రాజకీయ శక్తిని సృష్టించి ప్రజాబలం పొందేందుకు అవసరమైతే జాతీయ స్థాయిలో పర్యటించేందుకు ఉన్న అవకాశాలు, లేవనెత్తాల్సిన సమస్యలను ఈ సందర్భంగా చర్చించినట్లు విశ్వసనీయవర్గాలు చెప్పాయి. ఈ నెల 19న జరిగే ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో చర్చించిన తర్వాత ఢిల్లికి చేరుకొని పార్టీ పేరు రిజిస్ట్రేషన్‌, పార్టీ ప్రకటనపై పీకేతో విస్తృతంగా చర్చించారు.

కాగా, తెలంగాణ‌లో బీజేపి ప్లాన్‌ చేసుకున్న జాతీయ కార్యవర్గ సమావేశాలపై కూడా చర్చించినట్లు తెలిసింది. ఆలోగానే సీఎం కేసీఆర్‌ ప్రతిపాదిత కొత్త పార్టీని ప్రకటిస్తే ఈ సమావేశాలకు అంతగా ప్రాధాన్యతివ్వకుండా చేయొచ్చనే కోణంలో కూడా చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నీతి ఆయోగ్‌, కేంద్ర సంస్థలు, ఆర్బీఐ వంటి ప్రతిష్టాత్మక సంతస్థలు దేశానికి ఆదర్శంగా కొనియాడిన పథకాలను పార్టీ ప్రకటన సమయంలో ప్రస్తావించేందుకు రూట్‌ మ్యాప్‌ రెడీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

నదీ జలాల వివాదాలు, గవర్నర్ల వ్యవస్థ, నాన్‌ బీజేపీ, నాన్‌ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల పట్ల గతంలో, ప్రస్తుతం ఆయా పార్టీలు వ్యవహరిస్తున్న తీరు, కేంద్ర ప్రభుత్వాల వివక్ష, ఆర్ధిక నియంత్రణలతో ఇబ్బందులు, బెదిరింపులు, ఈడీ కేసుల వంటి అనేక అంశాలను ఈ సందర్భంగా చర్చించి వీటిలో ఏయే అంశాలను జాతీయ స్థాయిలో ప్రముఖంగా వినిపించేలా ఎజెండాలో పొందుపరుస్తే బాగుంటుందన్న విషయాలను లోతుగా చర్చించారని తెలిసింది. తాజాగా ఏ కూటమికి మద్దతివ్వకుండా సొంతగా జాతీయ పార్టీ ప్రకటనకే మొగ్గు చూపుతున్న సీఎం కేసీఆర్‌తో పీకే మంచీ చెడులను వివరించినట్లు తెలిసింది.

- Advertisement -

ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ పెట్టబోయే పార్టీకి దేశవ్యాప్తంగా మద్ధతు లభించనుందని, యునైటెడ్‌ ప్రంట్‌,, నేషనల్‌ ఫ్రంట్‌లవంటి కూటములు ఫెయిలయిన తీరుపై చర్చించి తమపార్టీకి సానుకూలతపై విశ్లేషించినట్లు సమాచారం. దేశంలో నెలకొన్న స్థబ్ధత వీడిపోయాలా చేసి కొత్త పార్టీపై దేశమంతటా చర్చ జరిగేలా కార్యాచరణ రూపొందించాలని పీకే సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు ఫాంహౌజ్‌లో గతవారం పీకేతో చర్చించిన అంశాలను మరోసారి చర్చించి తుది రూపుకు తెచ్చినట్లు తెలిసింది.

కేంద్రంలోనీ బీజేపి సర్కార్‌ తాజాగా, తరుచుగా రాజకీయ ప్రత్యర్ధులపై కక్షపూరితంగా ఈడీ దాడులతో బెదిరింపుల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పెట్టనున్న కొత్త పార్టీ ఒక్కటే ప్రత్యమ్నాయ శక్తిగా ఎదగనుందనే అంశాన్ని దేశంలోని ప్రాంతీయ పార్టీలకు చేరేలా ఢిల్లి వేదికగా పార్టీ ప్రకటన చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. దేశానికి ప్రత్యామ్నాయ పార్టీ ఆవశ్యకత, దేశంలో నెలకొన్న మతతత్వ రాజకీయాలు, వివక్షను వివరించి కలిసివచ్చే శక్తులతో అట్టహాసంగా పార్టీ ప్రకటనకు నిర్ణయించినట్లుగా తెలిసింది. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్‌ సుడిగాలి పర్యటనలపై కూడా చర్చించారు.

ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ ప్రచారంపై వాస్తవాలను వివరించేలా రూట్‌ మ్యాప్‌కు చర్చించినట్లు సమాచారం. నియోజకవర్గాల వారీగా టీఆర్‌ఎస్‌ పార్టీ పరిస్థితులపై సర్వే నిర్వహించిన పీకే ఈ దఫా జాతీయ రాజకీయాలు, కొత్త పార్టీ ప్రకటనపైనే చర్చించినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement