జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం దేశ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులతో పాటు భవిష్యత్ రాజకీయాలపై చర్చిస్తున్నారు.
ఈ సమావేశం కంటే ముందు సీఎం కేసీఆర్ రాంచీలోని గిరిజన ఉద్యమకారుడు బిర్సా ముండా విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. బిర్సా ముండా గిరిజన జాతికి, ఈ దేశానికి అందించిన సేవలను సీఎం కొనియాడారు.
గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సహాయం అందజేయనున్నారు. గల్వాన్‌లోయలో మరణించిన వీరజవాను కుందన్‌కుమార్ ఓఝా సతీమణి నమ్రత కుమారి, మరో వీరుడు గణేశ్ హన్సదా మాతృమూర్తి కప్రా హన్సదాలకు రూ.పది లక్షల చొప్పున చెక్కులను సీఎం కేసీఆర్ అందజేస్తారు.