Friday, November 22, 2024

రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

మాజీ ఎంపీ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీ అధిష్టానం ఎంపిక చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ కాగా… ఎన్నికల నోటిఫికేషన్ 12వ తేదీ విడుదల కానుంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బండా ప్రకాశ్ డిసెంబర్ 2న రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయగా.. ఆ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో ఏ పదవీ లేక ఖాళీగా ఉన్న పొంగులేటిని సీఎంకే కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పెద్దల సభకు పంపిచేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు పొంగులేటిని సిద్ధంగా ఉండాలని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ స్థానం శ్రీనివాసరెడ్డికి కాకుండా నామాకు ఇవ్వడంతో పొంగులేటి అప్పటినుంచి ఏ పదవీ లేకుండా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆయనకు పలుసార్లు హామీలు ఇచ్చి నెరవేర్చలేదు. ఈ క్రమంలో పార్టీకి, పొంగులేటికి మధ్య కొంత గ్యాప్ కూడా వచ్చింది. టీఆర్‌ఎస్ లో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయనను వదులుకుంటే పార్టీకి నష్టం అని భావించిన అధిష్టానం.. మిగిలిన రెండేళ్లకు గాను రాజ్యసభకు పొంగులేటిని పంపించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 30న పోలింగ్, ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే పొంగులేటి 1000 కార్లతో భారీ అనుచరగణంతో ఈ నెల 18వ తేదీన నామినేషన్ వేసేందుకు వెళ్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పొంగులేటి అత్యంత సన్నిహితులు, కొంతమంది అనుచరులకు సమాచారం కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. పొంగులేటి మంత్రి కేటీఆర్ అత్యంత సన్నిహితుల్లో ఒకడిగా ఉంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని కొంతమంది నేతలు పొంగులేటిపై ఎన్నోసార్లు ఆధిపత్యం చెలాయించినా.. మంత్రి కేటీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం వల్ల భరిస్తూ వచ్చారు. కేటీఆర్ సైతం కచ్చితమైన హామీ ఇస్తూ వస్తున్నార. ఈ క్రమంలో రాజ్యసభకు ఎంపిక చేసినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement