తెలంగాణలో చేనేత వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. చేనేతల అభివృద్ధి కోసం చాలా చేసానా.. సరిపోవడం లేదన్నారు. చేనేతల బాధలను విముక్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. సిద్ధాంతం కోసం నిబద్ధతతో ఎల్.రమణ పనిచేస్తారని, ఆయనతో సహా పార్టీలో చేరిన నేతలకు మంచి పదవులు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రమణకు మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందన్నారు. టీఆర్ఎస్‌లో చేనేత వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేదన్న లోటు రమణ చేరికతో తీరిందన్నారు.
చేనేతల బాధ్యత ఎల్.రమణకు అప్పగిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. చేనేత సామాజిక వర్గం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. రైతు బీమా తరహాలో చేనేతలకు కూడా బీమా వర్తింపచేస్తానని కేసీఆర్ వెల్లడించారు. వరంగల్‌లో వెయ్యి ఎకరాల్లో మెగా టెక్స్ టైల్స్ పార్కు ఏర్పాటు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు.
దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో చేపట్టామని, పథకం ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రతి గ్రామంలో ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ప్రజలు అవకాశం ఇచ్చారు. చిన్న తప్పు దొర్లితే కొన్ని తరాలకు దెబ్బకొడుతుందన్నారు. అందుకనే అజెండా ప్రకారం మార్గదర్శకాలు రూపొందించి ముందుకెళ్తున్నామని తెలిపారు. తెలంగాణ పునఃనిర్మాణానికి విశేష కృషి చేసిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్, ఆర్.విద్యాసాగర్ రావు అంటూ వారి సేవలను సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: వాట్.. కేటీఆర్ ను కూడా సంతోష్ సైడ్ చేస్తున్నాడా?!