తెలంగాణ సాకారమైనట్లే ఎస్సీల అభివృద్ధి కూడా జరగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఏడాది క్రితమే దళితబంధు పథకం ప్రారంభం కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆలస్యమైందన్నారు. దళితబంధు ఇస్తామనగానే కిరికిరిగాళ్లు కొండి పెడుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశపెడతామన్న విపక్షాలవి అపోహలు, అనుమానాలు అని మండిపడ్డారు. ఇరత పార్టీలకు రాజకీయం అనేది ఒకే గేమ్ అని విమర్శించారు. పేదలకు రూపాయి ఇవ్వని పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నాయని అన్నారు. నూటికి నూరు శాతం దళితబంధును అమలు చేస్తామని స్పష్టం చేశారు.
హుజురాబాద్ నియోజవకర్గంలో మొత్తం 21 వేల దళిత కుటుంబాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. రెండు, మూడు నెలల్లో దళితులందరికీ దళితబంధు ఇస్తామన్నారు. 25 ఏళ్ల క్రితం నుంచే దళితుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. అవకాశాలు, ఆస్తులు లేక దళితులు అణగారిపోయి ఉన్నారని పేర్కొన్నారు. దళితబంధు ప్రభుత్వ కార్యక్రమం కాదు.. ఇది మహా ఉద్యమం అని ఈ ఉద్యమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుందన్నారు. ఎస్సీలలో నిరుపేదలకు ముందుగా దళితబంధు నిధులు ఇస్తామన్నారు. నాల్గో దశలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ఎస్సీలకు దళితబంధు అమలు చేస్తామని వివరించారు. భవిష్యత్ లో భారత్ లో జరగబోయే దళిత ఉద్యమానికి హుజురాబాదే పునాది పేర్కొన్నారు. రాబోయే 15 రోజుల్లో ఇంకో రూ.2 వేల కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. దళితులంటే దరిద్రులం కాదు.. ధనవంతులం అని మారి చూపించాలని పేర్కొన్నారు. భారతదేశంలో దళితుల మాదిరిగా ప్రపంచ వ్యాప్తంగా 165 జాతులు సామాజిక వివక్షకు గురయ్యాయని చెప్పారు. అంబేద్కర్ పోరాటం వల్ల అన్ని పదవుల్లో రిజర్వేషన్లు, ఉద్యోగ అవకాశాలు లభించాయని సీఎం తెలిపారు. అయినా ఇప్పటికీ సామాజిక వివక్ష ఎదుర్కొంటున్నారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.