Monday, November 18, 2024

Asifabad: పోలీస్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆసిఫాబాద్‌ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయం ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొత్తగా నిర్మించిన జిల్లా పోలీస్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌కు సీఎం కేసీఆర్‌ చేరుకున్నారు. అక్కడ రిబ్బన్‌ కట్‌ చేసి పోలీస్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.

అంతకుముందు పోలీస్‌ కాంప్లెక్స్‌ ప్రాంగణంలోకి చేరుకోగానే జిల్లా పోలీసులు సీఎంకు గౌరవ వందనం సమర్పించారు. గాల్లోకి కాల్పులు జరిపి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీని తన కొత్త కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ.. సీఎంకు శాలువా కప్పి సన్మానించారు. ఓ చిత్ర పటాన్ని జ్ఞాపికగా బహూకరించారు. అలాగే జిల్లా కేంద్రంలోని కుమ్రంభీం చౌరస్తాలో గోండు వీరుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అయిన కుమ్రంభీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కుమ్రంభీం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం వెంట రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement