Friday, November 22, 2024

జిల్లాను ద‌త్త‌త తీసుకుంటా.. పనితీరు సరిగా లేకుంటే క్షమించే ప్రసక్తేలేదు: సీఎం వార్నింగ్

రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఆదివారం ప్రగతిభవన్ లో పల్లెప్రగతి, పట్టణప్రగతి పురోగతిపై సీఎం కేసీఆర్​ సమీక్షించారు. అదనపు కలెక్టర్లు, డీపీవోలతో 5 గంటలకుపైగా సమాలోచనలు జరిపారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్లు, అధికారులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని స్పష్టంచేశారు. తాను కూడా స్వయంగా ఒక జిల్లాను దత్తత తీసుకుని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని చెప్పారు. పల్లెలు, పట్టణాలను ప్రగతి పథంలో నడిపించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు కంకణబద్ధులు కావాలని, గ్రామాలు పట్ణణాల అభివృద్ధిని ఒక యజ్ఞంలా భావించి కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు.

మొక్కలు నాటే హరితహారం కార్యక్రమాన్ని త్వరలో చేపట్టాలని అధికారులకు సూచించారు. తాను చేపట్టబోయే ఆకస్మిక తనిఖీలు, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లో మెక్కలు నాటడం తదితర కార్యక్రమాల పురోగతి తనిఖీలో భాగంగానే సాగుతాయని సీఎం స్పష్టం చేశారు. అధికారులు పనితీరు చక్కదిద్దుకోకపోతే క్షమించే ప్రసక్తే లేదన్నారు. ఆకస్మిక తనిఖీ సందర్భంగా అదనపు కలెక్టర్లు, డీపీఓల పనితీరు బేరీజు వేసి కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం తేల్చిచెప్పారు. ఆ తర్వాత ఎవ్వరు చెప్పినా వినేదిలేదన్నారు.  అన్ని అవకాశాలు కల్పించి అన్ని రకాలుగా ప్రోత్సహించినా కూడా, నిర్దేశించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించకోపోవడం నేరమన్నారు

జూన్ 20న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జూన్ 21న వరంగల్ జిల్లాలో ఆకస్మిక తనిఖీ ఉంటుందన్నారు. వరంగల్ జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించి, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తానని తెలిపారు. స్థానిక సంస్థల సమస్యల తక్షణ పరిష్కారం కోసం అదనపు కలెక్టర్లకు 25 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు సీఎం తెలిపారు.

వరంగల్ లో విశాల ప్రదేశంలో నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని 24 అంతస్తులతో అత్యంత ఆధునిక సాకేంతిక హంగులతో గ్రీన్ బిల్డింగ్ గా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. అత్యవసర చికిత్సకోసం వచ్చే పేషెంట్ల కోసం ఆస్పత్రిని బిల్డింగ్ మీదనే హెలీకాప్టర్ దిగే విధంగా హెలీపాడ్ ను నిర్మించాలన్నారు. కెనడా మోడల్ లో, ధారాళంగా గాలి వెలుతురు ప్రసరించే విధంగా క్రాస్ వెంటిలేషన్ పద్దతుల్లో హాస్పటల్ నిర్మాణముండాలని, వైద్యాధికారులను సీఎం ఆదేశించారు. అందుకు కెనడా పర్యటించి రావాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement