Saturday, November 23, 2024

తెలంగాణపై కేంద్రం చిన్నచూపు: అసెంబ్లీలో కేసీఆర్ ఫైర్

తెలంగాణను కేంద్రం చిన్న‌చూపు చూస్తోంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు. పర్యటకంతో పాటు ఇత‌ర విష‌యాల్లో కేంద్రం తెలంగాణ‌ను ప‌ట్టించుకోవ‌డం లేదన్నారు. సోమవారం శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ప్ర‌పంచ వార‌సత్వ క‌ట్టడంగా రామ‌ప్ప దేవాల‌యం మంత్రి శ్రీనివాస్ గౌడ్ స‌మాధానం ఇచ్చిన అనంత‌రం సీఎం కేసీఆర్ మాట్లాడారు.
తెలంగాణ చాలా ఉజ్వ‌ల‌మైన సంస్కృతి, చ‌రిత్ర, సంప్ర‌దాయాలు.. గొప్ప క‌ళ‌ల‌తో కూడుకున్న ప్రాంతం అని అన్నారు. 58 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో తెలంగాణ‌ను ప‌ట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో రామప్ప ఆలయమే కాకుండా వారసత్వ పరంపరలో వచ్చిన చాలా కట్టడాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. వాటిని గుర్తించి పునర్ వైభవం తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అష్టాదశ పీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారి శక్తిపీఠాన్ని కూడా పాలకులు పట్టించుకోలేదని, కృష్ణా, గోదావరి పుష్కరాలకు కూడా ఆదరణ లభించలేదని కేసీఆర్ తెలిపారు.

చారిత్రాక ఉజ్వ‌ల‌మైన అవ‌శేషాలు ఉన్న తెలంగాణ ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్య వైఖ‌రితో ఉందని ఆరోపించారు. తెలంగాణ‌లో క‌ళాకారులు, విశిష్ట‌మైన వ్య‌క్తులు ఉన్నారని తెలిపారు. ప‌ద్మ‌శ్రీ అవార్డుల కోసం జాబితాను పంపాలా? వ‌ద్దా? అని ప్ర‌ధాని మోదీ, అమిత్ షాను అడిగానని చెప్పారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఆర్డీఎస్ మీద అన్యాయాన్ని నిల‌దీసేందుకు జోగులాంబ నుంచే మొట్ట‌మొద‌టిసారిగా పాద‌యాత్ర చేప‌ట్టానని గుర్తు చేశారు.

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి నీళ్లు, విద్యుత్, వ్యవసాయం విషయంలో రాష్ట్రంలో కాస్త ఇబ్బందులున్నందున పర్యాటకంపై దృష్టిసారించలేక పోయామని సీఎం చెప్పారు. అయితే, ఇప్పుడు ఆ సమస్యలన్ని పరిష్కారమవ్వడం వల్ల పర్యాటక రంగాన్నిప్రగతి పథంలో పరుగులు పెట్టించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement