హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బీసీ వర్గానికి టీఆర్ఎస్వీ(TRSV) రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ కు ఖాయం అయినట్లు సమాచారం. సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తర్వాతే గెల్లు శ్రీనివాస్ పేరును పార్టీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. గెల్లు శ్రీనివాస్ తో పాటు ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన స్వర్గం రవి, జమ్మికుంట స్థానిక నేత వీరేశం, వకుళాభరణం కృష్ణమోహన్ పేర్లు పరిశీలించినా.. గెల్లుకే ఇవ్వాలని సీఎం కేసీఆర్ డిసైడ్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యనభ్యసించిన గెల్లు శ్రీనివాస్.. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బొంతు రామ్మోహన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బాల్క సుమన్‌తో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనపై 128 పైగా కేసులు నమోదయ్యాయి. జైలు జీవితం కూడా గడిపారు. మానుకోట సంఘటనలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈటల రాజేందర్ తరచూ బీసీ నాయకుడినని, ఉద్యమకారుడినని ప్రజల్లో నినాదం వినిపిస్తుండటంతో ఆయనకు చెక్ పెట్టాలంటే యాదవ సామాజికవర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ అయితేనే మంచిదనే అభిప్రాయం సర్వేల ద్వారా తేలినట్లు సమాచారం. దీంతో సీఎం కేసీఆర్ ఆయన పేరునే ఫైనల్ చేసినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
మొదట్లో పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్ తరఫున రేసులో ఉన్నారని ప్రచారం జరిగినా.. ఆయనకు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు మంత్రి వర్గం సిఫారుసు చేసింది. దీంతో ఆయన రేస్ నుంచి తప్పుకున్నారు. మాజీ మంత్రి ఈటల బీసీ నినాదంతో వెళ్లడంతో.. సీఎం కేసీఆర్ కూడా బీసీ వర్గం నుంచే అభ్యర్థిని బరిలో దింపాలని నిర్ణయించారు. హుజురాబాద్ ఉపఎన్నికకు సంబంధించిన నోటీఫికేషన్ ను ఈసీ ఈ వారంలోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ గెల్లు శ్రీనివాస్ పేరును నేడో, రేపో అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.
ఇది కూడా చదవండి: హుజురాబాద్ ఉపఎన్నికకు ఈసీ రెడీ!