Tuesday, November 26, 2024

నేతన్నకు భరోసా… త్వరలో చేనేతలకు బీమా!

రైతు బీమా మాదిరి చేనతలకు కూడా త్వరలో బీమా సౌకర్యాన్ని అమల్లోకి తెస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. చేనేత కార్మికులకు సీఎం జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేసీఆర్ అన్నారు.  మారిన సాంకేతిక యుగంలో పవర్ లూమ్‌లు నడుపుతూ వాటిలో పనిచేస్తున్న నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతున్నదన్నారు. గత పాలనలో కునారిల్లిన రాష్ట్ర చేనేత రంగాన్ని అనతి కాలంలోనే పునరుజ్జీవింప చేసుకున్నామన్నారు. చేనేత ఉత్పత్తుల ప్రాధాన్యతను గుర్తించి, ఆదరించి ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు.

చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి, వారిని ఆత్మహత్యలనుంచి దూరం చేసి వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపుతున్నద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. బతుకమ్మ చీరలు తదితర కార్యక్రమాలతో వారికి చేతినిండా పని కల్పించి, సంపాదన పెంచి, ఆర్థికంగా చేనేత కుటుంబాలకు భరోసానిస్తున్నామన్నారు. వారి ఆత్మగౌరవం పెంచే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని సీఎం తెలిపారు. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులను గుర్తించి సత్కరించుకుంటున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ పేరుతో అవార్డులు అందిస్తున్నామని సీఎం అన్నారు. ఎగ్జిబిషన్లు , ఫ్యాషన్ షోలను నిర్వహిస్తూ చేనేతలకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. రైతు బీమా మాదిరి చేనేత కార్మికులకు బీమా సౌకర్యాన్ని అమలులోకి తేనున్నామన్నారు. చేనేత కార్మికులకు ఫించన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనన్నారు.

చేనేత కార్మికులకు రుణమాఫీ పథకం, నేతన్నలకు చేయూత, చేనేత మిత్ర వంటి పథకాల ద్వారా చేనేత సొసైటీలకు ప్రభుత్వం వాటా ధనాన్ని అందించడం, కార్మికులకు నూలు, రంగులు, రసాయనాలకు సబ్సిడీలు అందించడం, చేనేత మగ్గాలను ఆధునీకరించడం వంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి విజయవంతగా అమలు చేస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. పద్మశాలీలను సామాజిక ఆర్థిక రంగాల్లోనే కాకుండా రాజకీయ పాలనా వ్యవస్థల్లో కూడా ప్రోత్సహిస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ఈ వార్త కూడా చదవండిః త్వరలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ.. దళిత వర్గానికి డిప్యూటీ సీఎం పదవి!

Advertisement

తాజా వార్తలు

Advertisement