హైదరాబాద్, ఆంధ్రప్రభ: మళ్లీ పోరాటాల సీజన్ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఉద్యమించినట్లుగానే కేంద్రంలోని బీజేపి సర్కార్ వివక్షపై అంతే గట్టిగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులకు అండగా నిలుస్తూనే నేరుగా పోరాటంలో పాల్గొనేందుకు సిద్దమయ్యారు.సోమవారం ఢిల్లీలో తెలంగాణ భవన్ వేదికగా ధాన్యం కొనుగోలు డిమాండ్‌తో నిర్వహించనున్న మహా ధర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. ఉదయం 9.30 గంటలనుంచే ఆయన ధీక్షలో కూర్చుంటారని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నేతలు, అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు డిల్లీకి చేరుకున్నారు. నిరసన ధీక్షకు పార్టీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎండ వేడిమికి ఇబ్బందులు లేకుండా షామియానాలను వేశారు. భారీగా స్టేజ్‌ను కూడా పార్టీ ఎంపీలు దగ్గరుండి నిర్మాణం చేయించారు. గత ఆదివారం సీఎం కేసీఆర్ దంపతులతోపాటు ఎంపీ కవిత ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన దంత సమస్యలపై చికిత్స తీసుకున్న తర్వాత ప్రధానితో భేటీకి ప్రయత్నించారు. కాని అక్కడి నుంచి సానుకూల ప్రకటన రాకపోవటంతో బీజేపీ వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేసేందుకు అక్కడి నుంచే వ్యూహాన్ని వేగవంతం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారం రోజులపాటు రాష్ట్రంలో అయిదంచెల ఉద్యమాన్ని విజయవంతం చేశారు.
ఈ నేపథ్యంలో చివరగా ఢిల్లీలో మహాధర్నాను నిర్వహించేందుకు ఆయన అక్కడి నుంచే పలు వర్గాలతో వరుస భేటీలు నిర్వహించారు. అయితే సీఎం కేసీఆర్ ఈధర్నాలో పాల్గొంటారా..? లేదా..? అన్న అంశాన్ని చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచిన పార్టీ వర్గాలు చివరి నిమిషంలో ఆదివారం రాత్రి ఆయన ధర్నాలో పాల్గొంటారని స్పష్టతనిచ్చాయి.
రాజధాని ఢిల్లిdలో జరిగే రైతు రణంలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొని రైతు సమస్యలను వినిపించనున్నారు. తెలంగాణలో ఎంతో కష్టించి ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్లక్ష్యాన్ని రూపుమాపి ఇప్పడిప్పుడే ప్రాజెక్టుల నిర్మాణంతో అదనపు ఆయకట్టు స్తిరీకరించుకున్నామని, ఈ నేపథ్యంలో భారీగా ధాన్యం ఉత్పత్తి అవుతోందని ఆయన ఈ వేదికగా అన్ని అంశాలను కూలంకషంగా వివరించనున్నారు. వన్ నేషన్ వన్ పాలసీ దిశగా ఆయన పట్టుపట్టనున్నారు. రైతు వ్యతిరేక విధానాలను కేంద్రం విడనాడాలని, తెలంగాణ రాష్ట్రంపై మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ముందుకు వెళ్లడం మానుకోవాలని ఆయన నినదించనున్నారు. కేంద్రం దిగిరావాలి…ధాన్యం కొనుగోలు చేయాలని పార్టీ శ్రేణులు ముక్త కంఠంతో ఢిల్లీ వీధులు మార్మోగేలా రణనినాదాలు చేయనున్నారు.
కాగా జాతీయ స్థాయిలో రైతు చట్టాలపై జరిగిన ఆందోళన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై ఏ పార్టీ ఇంత పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించలేదు. నేటీ టీఆర్ఎస్ ధర్నాలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొంటున్న నేపథ్యంలో ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చకు తావిస్తున్నది. దేశ ప్రజలను, ప్రధానంగా రైతులను ఈ ధర్నా తీవ్ర ఆలోచనలో పడవేస్తున్నది. టీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఈ మెగా ధర్నాకు దేశంలోని అనేక పక్షాలు, రైతు సంఘాల మద్ధతు లభిస్తోంది. రైతాంగ సమస్యలపై సీఎం కేసీఆర్ చేస్తున్న పోరుకు అన్ని వర్గాలు ముగ్ధులవుతున్నాయి. అలుపెరుగకుండా, ఎటువంటి బెదిరింపులకూ లొంగకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఆయన చేస్తున్న పోరుకు రైతాంగం సలాం చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతు బీమాలను అందిస్తున్న తెలంగాణ సర్కార్ ఇప్పటికే అనేక రాష్ట్రాల రైతులను ఆలోచనలో పడేసింది. ఇక పోరుగు సరిహద్దు రాష్ట్ర రైతులు తమను తెలంగాణలో కలుపాలని తీర్మానాలు చేశారు. ఇవే కాకుండా అనేక పథకాలకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపురాగా, కేంద్ర సంస్థలైన నీతి ఆయోగ్ వంటివి పథకాలను దేశమంతటా అమలు చేయవచ్చనే సిఫార్సులు చేశాయి.
దేశంలో ఇప్పటికే అనేక మార్పులు, నీటి పంచాయితీలు, కొత్త రాజ్యాంగం కావాలని, ఫెడరల్ స్పిరిట్ వంటి అంశాలపై లేఖాస్త్రాలు సందించిన సీఎం కేసీఆర్ నేటి ధర్నాతో కేంద్రంపై మరింత పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతాంగ ప్రభుత్వంగా పేరుపడిన తెలంగాణ సీఎం కేసీఆర్ కేసీఆర్ రైతు సమస్యలతోపాటు, ఇఇతర అనేక అంశాలను కూడా ఈ మహా ధర్నాలో ప్రస్తావించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉదయం 9.30గంటలనుంచి సాయంత్రం వరకు జరిగే దర్నాకు ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవనున్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగంపై జాతీయ స్థాయి మీడియాతోపాటు, దేశ రైతాంగం తీవ్ర ఉత్కంఠతో వేచి చూస్తోంది. మహా ధర్నాలో సీఎం కేసీఆర్ నోటివెంట వచ్చే అంశాలు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించనున్నాయని అంటున్నారు.