కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కిన్నెరమెట్ల కళాకారుడు దర్శనం మొగులయ్యకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.కోటి బహుమతిగా ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో నివాసస్థలం, ఇంటి నిర్మాణం, ఇతరత్రా అవసరాల కోసం ఈ మొత్తాన్ని ఇస్తున్నట్టు తెలిపారు. దర్శనం మొగుల య్య శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మొగులయ్య కుశాలువా కప్పి సత్కరించారు. గొప్ప కళారూపాన్ని మొగులయ్య కాపాడుతున్నారని ప్రశంసించారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తంచేశారు.
ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని గౌరవ వేతనాన్ని కూడా అందిస్తున్నదని సిఎం తెలిపారు. హైదరాబాద్‌లో నివాస స్థలం, ఇంటి నిర్మాణం విషయంగా మొగులయ్యతో సమన్వయం చేసుకుని, కావాల్సిన ఏర్పాట్లు చూసుకోవాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సీఎం ఆదేశించారు. తెలంగాణ కళలను పునరుజ్జీవం చేసుకుంటూ, కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు.