కోవిడ్ నివారణలో రాష్ట్రానికి అందిస్తున్న సహాయానికి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సీఎం జగన్. దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్ అంశాలపై ప్రధాని సమీక్ష చేపట్టారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొన్నామని అన్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు రాష్ట్రంలో లేవన్నారు. రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలు కూడా ఏపీలో లేవన్నారు. అయినా కోవిడ్‌ను ఎదుర్కొన్నామన్నారు.
రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా వైరస్ విస్తరణను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పనిచేశాయని ప్రధాని మోదీకి సీఎం తెలిపారు. ఇప్పటివరకు 12 సార్లు ఇంటింటికీ ఫీవర్ సర్వే చేశామని వివరించారు. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, ఫోకస్‌గా టెస్టులు చేసినట్లు తెలిపారు.దీంతో కోవిడ్ విస్తరణను అడ్డుకోగలిగామని చెప్పారు. వ్యాక్సినేషన్ అనేది కోవిడ్‌కు సరైన పరిష్కారం అని పేర్కొన్నారు.
రాష్ట్రానికి 1,68,46,210 వ్యాక్సిన్ డోసులు వచ్చాయని, వీటితో 1,76,70,642 మందికి వ్యాక్సిన్లు ఇచ్చినట్లు సీఎం జగన్ చెప్పారు. జూలైలో 53,14,740 వ్యాక్సిన్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారన్నారు. అదే సమయంలో ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 వ్యాక్సిన్లను కేటాయించారని తెలిపారు. అయితే, క్షేత్రస్థాయిలో వారికి కేటాయించిన వ్యాక్సిన్లను పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నారని సీఎం అన్నారు. జూన్‌లో ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సినేషన్ చేయించుకున్న వారి సంఖ్య కేవలం 4,20,209 మాత్రమేనని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోయిన స్టాకు కోటాను తిరిగి రాష్ట్రానికి కేటాయించాలని ప్రధానిని కోరారు. రాష్ట్రం మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఇది దోహదపడుతుందన్నారు. కోవిడ్ నివారణలో కేంద్ర ప్రభుత్వ సలహాలు, సూచనలు, మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకు సాగుతామని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: రాష్ట్రంలో అన్ని గోతులే.. ఎంపీ రఘురామ సెటైర్లు