Monday, November 18, 2024

ఏపీలో కోటి మందికి కోవిడ్‌ వ్యాక్సిన్స్

ఏపీలో నాలుగు వారాల్లో కోటి మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.  ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సినేషన్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తైనందున సోమవారం నుంచి అర్బన్ ప్రాంతాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ చేపడతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రతి మండలంలో వారానికి నాలుగు రోజులు, రోజుకు రెండు గ్రామాల చొప్పున ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. లోపాలు సరిదిద్దిన తర్వాత విస్తృతస్థాయిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం, అధికారులను సీఎం ఆదేశించారు.

సమీక్షలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ మరో 6 రోజులు మాత్రమే మిగిలి ఉందని.. ఈ ఎన్నికలు వెంటనే పూర్తయి ఉంటే వ్యాక్సినేషన్‌పై పూర్తి దృష్టి పెట్టేవాళ్లమన్నారు. కానీ అలా జరగలేదని చెప్పారు. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొందని.. దీనివల్ల వ్యాక్సినేషన్‌కు అడ్డంకులు వచ్చే పరిస్థితి ఏర్పడిందని సీఎం అభిప్రాయపడ్డారు. దీనిపై అధికార యంత్రాంగంలో సందిగ్ధ వాతావరణం ఉందన్నారు.

ప్రజారోగ్యానికి భంగం కలిగించే ఇలాంటి పరిస్థితులకు బాధ్యులు ఎవరు? అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోందని జగన్ అన్నారు. ఏది ఏమైనా మనం చేయాల్సిన పని మనం చేయాలన్న జగన్.. వ్యాక్సినేషన్‌ను ఉధృతం చేస్తూ.. ప్రజారోగ్యాన్ని కాపాడే యజ్ఞం ముమ్మరంగా కొనసాగించాలని జగన్ ఆదేశించారు. అలాగే వీలైనంత త్వరగా విలేజ్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అమల్లోకి తీసుకురావాలని జగన్ అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ను పూర్తిస్థాయి యాక్టివిటీగా గ్రామాల్లో చేపట్టాలన్నారు. గ్రామ, వార్డు సెక్రటేరియట్‌లు, వలంటీర్లు, ఆశావర్కర్లు, హెల్త్‌ వర్కర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యానికి మరింత ప్రచారం నిర్వహించాలని, అందరూ వేసుకుంటున్నారా? లేదా? అనేది అక్కడికక్కడే పరిశీలన చేయాలని సూచించారు. పీహెచ్‌సీల్లో డాక్టర్ల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.

ఇక, 104 వాహనాలతో అనుసంధానంగా ఉన్న డాక్టర్ల సంఖ్య సరిపోతున్నారా? లేదా చూసుకోవాలన్న సీఎం… మండలానికి 2 పీహెచ్‌సీలు ఉండాలి, ఒక్కో పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులు ఉండాలని స్పష్టం చేశారు. అలాగే ప్రతి మండలానికి రెండు 104 వాహనాలు.. ఒక్కో వాహనంలో ఒక్కో డాక్టరు ఉండాలని సూచించారు. నెలకు మూడు సార్లు ప్రతి గ్రామాన్నీ వైద్యుడు సందర్శించాలని ఆదేశించారు.

వైద్యుల నియామకంలో ఎలాంటి సంకోచాలు వద్దని.., దీనికి అవసరమైన నిధుల జారీలో ఎలాంటి అలక్ష్యం వద్దని ఆర్థిక శాఖ ఆధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. హెల్త్‌ వర్కర్లు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు ఇంకా 3.97 లక్షల మందికి వ్యాక్సిన్‌ పెండింగులో ఉందని అధికారులు సీఎంకు వివరించారు. అలాగే 60 ఏళ్లకు పైబడి, మరియు 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 59.08 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉందన్న అధికారులు వెల్లడించారు. మొత్తంగా కోటిమందికిపైగా వ్యాక్సినేషన్‌ను శరవేగంగా ఇవ్వడానికి అవసరమైన అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. వారానికి 25 లక్షల చొప్పున నాలుగు వారాల్లో కోటిమందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా సిద్ధం కావాలని జగన్ చెప్పారు.

కొవిడ్ నిర్ధారణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ముఖ్యమంత్రి.. టెస్టులన్నీ ఆర్టీపీసీఆర్ పద్ధతిలోనే చేయాలన్నారు. కొవిడ్ రోగులకు నిత్యం మెరుగైన వైద్యం అందాలన్నారు. ఏయే ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయన్న దానిపై దృష్టిపెట్టామన్న అధికారులు.., మిగతావాటితో పోలిస్తే పాఠశాలల్లో కేసులు సంఖ్య చాలా స్వల్పమని వివరించారు. ఏదైనా స్కూళ్లో కేసులు వస్తే… 3 రోజలుపాటు నిలిపేసి అందరికీ పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే తిరిగి నడిపేందుకు అనుమతిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement