Thursday, November 21, 2024

టాలీవుడ్ కి సీఎం జ‌గ‌న్ తాయిలం – రాజ్య‌స‌భ‌కి క‌మెడియ‌న్ అలీ !

నేడు టాలీవుడ్ ప్ర‌ముఖులు ప‌లువురు సీఎం జ‌గ‌న్ ని క‌లిసి సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న ప‌లు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. కాగా ఈ స‌మ‌స్య‌ల‌పై సీఎం జ‌గ‌న్ సానుకూలంగా స్పందించార‌ట‌. ఈ మేర‌కు రెండు వారాల్లో ఉత్త‌ర్వులు జారీ చేయ‌నున్నార‌ని స‌మాచారం. కాగా ఈ మీటింగ్ కి క‌మెడియ‌న్ ఆలీ కూడా వెళ్ళారు. అయితే ఆలీకి ఓ బంఫ‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. నేటి వ‌ర‌కు సినీ రంగం మద్దతు వైసీపీకి లేదు అనే విష‌యం తెలిసిందే. 2019 ఎన్నికల్లో కూడా చిన్న నటులు తప్ప, పెద్ద స్టార్లు ఎవరూ వైసీపీ వైపు చూడలేదు. అయినా 151 సీట్ల మెజారిటీతో జగన్ అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత కూడా ఆయనకు అభినందనలు కూడా సినీ సీమ నుంచి పెద్దగా లేవు అని అని వైసీపీ నేతలు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. సినీ పెద్దగా చరిష్మాటిక్ స్టార్ గా ఉన్న చిరంజీవికి రాజ్యసభ సీటు ఇచ్చి దగ్గర చేసుకోవాలని పార్టీ ఎత్తుగడ చేసిందనేది స‌మాచారం. కానీ అది సాధ్యం కాదని తేలిపోయింది. తాను రాజ‌కీయాల‌కి దూర‌మ‌ని చిరంజీవి స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు ఓ విష‌యం వైర‌ల్ అవుతోంది.

మైనారిటీ కార్డు తో పాటు సినీ రంగాన కమెడియన్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న అలీని ముందు పెట్టి టాలీవుడ్ తో గ్యాప్ ని తగ్గించుకోవాలని వైసీపీ భావిస్తోంద‌ట‌. ఈ క్రమంలో అలీకి రాజ్యసభ సీటు కన్ఫర్మ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. సినీ ప్రముఖులతో జగన్ జరిపిన భేటీకి అలీ కూడా వచ్చారు. ఈ సందర్భంగా అలీని జగన్ మళ్లీ మనం కలుద్దామని చెప్పారట‌. ఈ మళ్లీ కలుద్దాం అన్న మాట అయితే ఇపుడు తెగ వైరల్ అవుతోంది. జగన్, అలీని కలుద్దామని అన్నారూ అంటే కచ్చితంగా రాజ్యసభ సీటు ఆఫర్ కే అని ప్రచారం గట్టిగా సాగుతోంది..నిజానికి అలీ ఎమ్మెల్సీ పదవిని కోరుకున్నారు. ఇప్పటికి మూడు విడతలుగా ఎమ్మెల్సీ పోస్టులు భర్తీ అయ్యాయి. ఆ మధ్య అయితే ఎమ్మెల్సీ ఖాళీల ఎంపికకు ముందే, అలీ జగన్ ని కలసి వచ్చారు. మర్యాదపూర్వకమైన భేటీ ఇది అని నాడు చెప్పినా ..తన మనసులో మాటను సీఎం చెవిన అలీ వేసి వచ్చారు అని ప్రచారం జరిగింది.అయితే ఎమ్మెల్సీ పోస్టులలో జగన్ పార్టీ విధేయులకే కట్టబెట్టారు. ఇపుడు రాజ్య సభ చాన్స్ వచ్చింది. దాంతో చాలా మంది బిగ్ షాట్స్ కన్ను పడింది. తమకంటే తమకు వస్తుందని అంతా ఎదురుచూస్తున్న టైమ్ లో సడెన్ గా అలీ పేరు తెర మీదకు రావడం విశేషం.ఇక అలీ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆనాడు ఆయన ఎమ్మెల్యే టికెట్ కోరుకున్నారు. రాజమండ్రీకి చెందిన అలీకి టికెట్ కేటాయించలేకపోయారు. దాంతో అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి ఇస్తామని చెప్పారు. దానికి తగిన విధంగా ఇపుడు పెద్దల సభలో అలీ అడుగుపెట్టబోతున్నారు అని అంటున్నారు. ఎమ్మెల్సీగా నెగ్గి మంత్రి పదవి చేపట్టాలని ఉర్రూతలూరుతున్న అలీకి రాజ్యసభ పదవి అంటే ఒక విధంగా ఆనందకరమే అని చెప్పాలి. ఆరేళ్ల పాటు హాయిగా అలీ పెద్దల సభలో ఉండవచ్చు. మొత్తానికి చూస్తే అలీకి పదవి ఇవ్వడం ద్వారా సినీ రంగాన్ని గౌరవించాలన్న జగన్ ఆలోచన కూడా ఉంది. అదే సమయంలో పార్టీలో చేరి విధేయతగా ఉంటే కచ్చితంగా టాలీవుడ్ వారికి మరిన్ని పదవులు ఇస్తామన్న సంకేతం కూడా ఉంది అంటున్నారు.ఇక సినీ రంగంతో ఇపుడిపుడే మంచి సంబంధాలు నెలకొంటున్న నేపధ్యంలో దాన్ని మరింతగా పటిష్టం చేసుకోవాలన్న ఆలోచన కూడా వైసీపీకి ఉందని అంటున్నారు. అందుకే అలీకి రాజ్య సభ సీటు ఆఫర్ అని చెబుతున్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రగ‌నుందో.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement