ఆంధ్రప్రదేశ్ లో పొదుపు సంఘాల మహిళలకు వరుసగా రెండో ఏడాది కూడా ‘వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ’ పథకం కింద రూ.1109 కోట్ల నగదు సీఎం జగన్ జమ చేశారు. శుక్రవారం ఆన్ లైన్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో లబ్దిదారులకు డబ్బు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 1.02 కోట్ల మందికిపైగా పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. పొదుపు సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ప్రతి నెలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వరుసగా రెండో ఏడాది కూడా చెల్లించిందని చెప్పారు. మహిళా సాధికారితను ఆచరణలోకి తీసుకురాగలిగామన్నారు. బ్యాంకుల ద్వారా నేరుగా సున్నా వడ్డీకే రుణాలు అందిస్తున్నామని తెలిపారు. డ్వాక్రా సంఘాల అప్పుపై ఈ ఏడాది వడ్డీ రూ.1109 కోట్లు చెల్లిసున్నామని చెప్పారు.
మహిళలకు వ్యాపారపరంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని సీఎం వెల్లడించారు. గత ప్రభుత్వం రుణాల పేరుతో మహిళలను మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మహిళల రక్షణ కోసం ఎక్కడా రాజీ లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, 900 కొత్త వాహనాలను కొనుగోలు చేశామన్నారు. మద్యం నియంత్రణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం వివరించారు.
మంత్రివర్గంలో మహిళలకు తగిన ప్రాధాన్యత ఇచ్చామన్నారు. డిప్యూటీ సీఎంలలో ఒక మహిళ ఉండగా, హోం మంత్రి కూడా మహిళనే ఉన్నారని గుర్తు చేశారు. మున్సిపల్ పదవుల్లో కూడా 61 మహిళలకు ఇచ్చామని తెలిపారు. నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే పనుల్లో సగం మహిళలకు ఇస్తూ చట్టాలు చేశామని వెల్లడించారు. చివరకు ఆలయాల బోర్డులలో కూడా సగం మహిళలే కనిపిస్తారని సగర్వంగా తెలియజేస్తున్నాను అని తెలిపారు.
సకాలంలో రుణాలు తిరిగి చెల్లిస్తే స్వయం సహాయం సంఘాలకు చెందిన మహిళల రుణాలపై సున్నా వడ్డీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆ మేరకు వరసగా రెండో ఏడాది కూడా వైయస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా 9.34 లక్షల స్వయం సహాయక సంఘాలకు చెందిన 1.02 కోట్ల మహిళలకు ప్రయోజనం కలిగించే విధంగా వారి రుణ ఖాతాలలో రూ.1109 కోట్లు జమ చేశారు. క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కిన సీఎం వైఎస్ జగన్ ఈ మేరకు ఆ మొత్తాన్ని స్వయం సహాయక సంఘాల మహిళల రుణ ఖాతాల్లో జమ చేశారు.