పేద కుటుంబాలను ఆదుకునేందుకు ‘వైఎస్ఆర్ బీమా’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వర్చువల్‌గా ప్రారంభించారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ వర్తించే ఈ పథకం కింద కుటుంబ పోషకులు సహజ మరణం పొందినా, ప్రమాదవశాత్తు చనిపోయినా పరిహారం అందేలా వైఎస్సార్ బీమా పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా అమలు చేస్తామని తెలిపారు. రూ. 750 కోట్లతో వైఎస్‌ఆర్ బీమా పథకం ప్రారంభించామని తెలిపారు. ఈ పథకం ద్వారా 1.32 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని జగన్ చెప్పారు. 18-50 ఏళ్ల వ్యక్తి సహజంగా మరణిస్తే రూ.లక్ష బీమా వస్తుందని, 18-70 ఏళ్ల వారు ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షల వరకు బీమా వస్తుందని అన్నారు. అంగవైకల్యానికి రూ.5లక్షల బీమా అందిస్తామన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా వైఎస్సార్ బీమా పథకం అమలు చేస్తుందని సీఎం జగన్ అన్నారు.
ఈ పథకం నుంచి 2020 ఏప్రిల్ నుంచి కేంద్రం తప్పుకుందని, పేదలకు మేలు చేయాలని మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. బీమా చెల్లింపునకు అయ్యే పూర్తి ఖర్చు బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. 2021-22 ఏడాదికి 1.32కోట్ల పేద కుటుంబాలకు రూ.750 కోట్లతో బీమా కల్పిస్తామని తెలిపారు. ఇప్పటివరకు రెండెళ్లలో మొత్తం రూ.1,307 కోట్ల మేర బీమా రక్షణ అమలులో ఉందని తెలిపారు. బ్యాంకులతో సంబంధం లేకుండా వైఎస్ఆర్ బీమా అమలు చేస్తామని సీఎం వివరించారు. 155214 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ‘వైఎస్ఆర్ బీమా’పై సందేహాలు నివృత్తి చేసుకోవాలని సీఎం జగన్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలకు పూర్తి బాధ్యతలు అప్పగించామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతీ వలంటీర్‌ను భాగస్వామ్యం చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటి పెద్ద, సంపాదించే వ్యక్తి మగ లేదా ఆడ ఎవరైనా సరే వారి పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ శాచురేషన్ పద్దతిలో అందరికీ ఇచ్చేలా కలెక్టర్‌లు అందరూ ధ్యాస పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.
కాగా, పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి మరణిస్తే.. ఆ కుటుంబం రోడ్డున పడకుండా బీమా అందనుంది. బీమా చెల్లింపునకు అయ్యే పూర్తి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ.. పేద కుటుంబాలకు ఉచిత బీమా అందించనుంది. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల వ్యక్తికి సహజ మరణం సంభవిస్తే.. ఆ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందిస్తారు. 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు గల వ్యక్తి ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం పొందినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా వస్తుంది. బ్యాంకుల్లో ఎన్‌రోల్‌మెంట్‌లో జరుగుతున్న జాప్యం, అవరోధాలకు చెక్ పెడుతూ ఈ పథకం అమలు చేయనున్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా జులై 1 నుంచి వైఎస్ఆర్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది.
ఇది కూడా చదవండి: డెల్టా వేరియంట్ కు కోవాగ్జిన్ తో చెక్!