Friday, November 22, 2024

టెన్త్, ఇంటర్ పరీక్షలు ఎందుకు నిర్వహిస్తున్నారంటే..

ఏపీలో విద్యార్థుల భవిష్యత్‌ గురించి తన కంటే ఎవరూ ఎక్కువగా ఆలోచించరని సీఎం జగన్ అన్నారు. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై విమర్శలు సరికాదన్నారు. విపత్కర పరిస్థితుల్లో అగ్గిపెట్టాలని చూస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెన్త్‌ పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్‌ కే నష్టమని పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లపైనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, మార్కులను బట్టే ఏ విద్యార్థికైనా కాలేజీలో సీటు వస్తుందన్నారు. పరీక్షలు నిర్వహించకుండా సర్టిఫికెట్లలో కేవలం పాస్‌ అని ఇస్తే.. భవిష్యత్‌ లో విద్యార్థులు నష్టపోతారన్నారు. పరీక్షలు నిర్వహించాలో వద్దో కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని జగన్ గుర్తు చేశారు. పాస్‌ సర్టిఫికెట్లతో విద్యార్థులకు మంచి సంస్థల్లో సీట్లు వస్తాయా? అని ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణకు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం లేదన్నారు. పరీక్షలు రద్దు చేయాలని అడగడం సులభమే.. కానీ విద్యార్థులకే నష్టమని జగన్‌ పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటామన్నారు.కోవిడ్ పై పోరాటంలో కచ్చితంగా గెలుస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు.

సీఎం క్లారిటీ ఇవ్వడంతో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరుగుతాయా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. ఓ వైపు రాష్ట్రంలో వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లి దండ్రులు అంతా పరీక్షలను రద్దు చేయాలి లేదా వాయిదా వేయాలని పదే పదే కోరుతూ వస్తున్నారు. పరీక్షల రద్దు అంశంపై ఇప్పటికే కొందరు కోర్టును సైతం ఆశ్రయించారు. పరీక్షలపై ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement