Friday, November 22, 2024

చండీగ‌ఢ్ లోని గురుద్వారాలో సీఎం భ‌గ‌వంత్ మాన్ రెండో వివాహం- హాజ‌ర‌యిన సీఎం కేజ్రీవాల్

చండీగ‌ఢ్ లోని గురుద్వారాలో అతి కొద్దిమంది స‌మ‌క్షంలో పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ రెండో వివాహం జ‌రిగింది. పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న భగవంత్‌ ఫోటోను ఆప్ నేత రాఘవ్ చద్దా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇందులో బంగారు వర్ణం దుస్తులు, పసుపు రంగు టర్బన్‌ను ధరించి వెలిగిపోయారు పంజాబ్‌ సీఎం. భగవంత్‌మాన్ వివాహం సిక్కుల సంప్రదాయం ప్రకారం నిరాడంబరంగా జరిగింది. ఆయన తల్లి, సోదరి, అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఆప్‌ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ కుటుంబంతో పాటు ఇతర పార్టీ నేతలు ఈ వేడుకకు హాజ‌ర‌య్యారు. ఈ రోజు నుంచి కొత్త జీవితం ప్రారంభించబోతున్న భగవంత్‌ మాన్‌కు శుభాకాంక్షలు అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

అంతకుముందు తన సోదరుడికి పెళ్లి జరగడం చాలా సంతోషంగా ఉందని ఆప్‌ నేత రాహుల్ చద్దా తెలిపారు. భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనేది ఆయన తల్లి కల అని, ఇప్పుడు అది నెరవేరడం ఆనందంగా ఉందన్నారు. మరి ఆమ్‌ ఆద్మీ పార్టీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‍లర్ అయిన మీ పెళ్లి ఎప్పుడు అని చద్దాను ట్విట్టర్‌లో ఓ జర్నలిస్ట్ అడిగారు. ముందు పెద్దవాళ్ల పెళ్లి జరిగిన తర్వాతే చిన్నవాళ్లు చేసుకుంటారని ఆయన చమత్కరించారు. భగవంత్ పెళ్లిలో అతిథులకు భారతీయ, ఇటాలియన్ వంటలు సిద్ధం చేయించారు. కరాహీ పనీర్‌, తందూరి కుల్చే, దాల్ మఖానీ, నవరత్న బిర్యానీ, మౌసమీ సబ్జీలు, ఆప్రికాట్‌ స్టఫ్డ్‌ కోఫ్తా, లసగ్న సిసిలియానో, బుర్రానీ రైత వంటి రకరాకల వంటలు తయారు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement