తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ఆదివారం భద్రాద్రి -కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. సర్వే సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరదలకు కారణమైన క్లౌడ్‌బర్స్ట్ పరిస్థితిని సృష్టించడంలో అంతర్జాతీయ కుట్ర ఉందేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు. వరదల వల్ల నష్టపోయిన ఒక్కో కుటుంబానికి రూ.10వేలు, 20కిలోల బియ్యం అందజేస్తామని ప్రకటించారు. భద్రాచలం కరకట్ట సమీపంలోని గోదావరి నదిని ముఖ్యమంత్రి పరిశీలించి వరద బాధితులతో మాట్లాడారు. భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పునరావాస కేంద్రంగా రూపుదిద్దుకున్న జిల్లా పరిషత్ పాఠశాలను ఆయన పరిశీలించారు.
ఎత్తయిన ప్రదేశాల్లో స్థలాలను గుర్తించి వరద బాధితులపూర్తి సమాచారం సేకరించాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ‘‘దేవుని దయ వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మేము హైదరాబాద్ నుండి కొంతమందిని పంపించాం, సైన్యాన్ని సహాయం చేయాలని కోరాము, NDRF, SDRF బృందాలు.. హెలికాప్టర్లను కూడా రెడీగా ఉంచాము.. అయితే ఎట్లాంటి ప్రాణనష్టం లేకుండా ఈ కీలక సమాయన్ని అధిగమించగలిగాము ” అని అతను చెప్పారు.
“దేశంలో క్లౌడ్‌బర్స్ట్ ల వెనుక విదేశీయుల హస్తం ఉందని కొన్ని పుకార్లు ఉన్నాయి. అంతకుముందు సంవత్సరం, లడఖ్‌లోని కాశ్మీర్ సమీపంలో.. తరువాత ఉత్తరాఖండ్‌లో ఇట్లాంటివి కనిపించాయి. ఇప్పుడు గోదావరి ప్రాంతాన్ని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ వాతావరణంలో మార్పుల వల్ల వరదలు వంటి సందర్భాలు వస్తాయని, ప్రజలను రక్షించడం ప్రభుత్వ కర్తవ్యం”అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రమాదం ఇంకా పోలేదని కేసీఆర్ అన్నారు.
వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తున్నందున జులై నెలాఖరు వరకు అప్రమత్తంగా ఉండాలని ఆయన స్థానిక అధికారులను ఆదేశించారు. “పునరావాస కేంద్రాలలో ఉన్న ప్రజలను వారి ఇళ్లకు తిరిగి పంపించడానికి తొందరపడకండి, ఇంకా ప్రమాదం ముగియలేదు,” అని సీఎం అన్నారు. వరద నివారణకు సహాయం చేయడానికి భద్రాచలం ప్రాంతాన్ని సమగ్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అనంతరం వరద ప్రభావాన్ని సర్వే చేసేందుకు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో బూర్గంపాడు నుంచి ఏటూరునాగారం వెళ్లారు.