Friday, November 22, 2024

TS: వ‌ర్సీటీల్లో రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు లైన్‌ క్లియర్‌.. ఫైల్‌పై సీఎం కేసీఆర్​ సంతకం.. త్వరలోనే ఉత్తర్వులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: యూనివర్సిటీలోని టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ నియామకాలకు సంబంధించి మరో ముందడుగు పడినట్లుగా తెలుస్తోంది. రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు ఆమోదం తెలుపుతూ సంబంధిత ఫైల్‌పై ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ సంతకం పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఏసమయంలోనైనా వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వర్సిటీలోని నియామకాల భర్తీ సమస్య ఓ కొలిక్కి రానుంది.

గత ఏప్రిల్‌ నెలలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో యూనివర్సిటీలలోని టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి కామన్‌ బోర్డు ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పారదర్శకంగా సుమారు 3500 పోస్టులను భర్తీ చేసేందుకు వీలుగా ఈ కామన్‌ బోర్డు పనిచేయనుంది. అయితే ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆధ్వర్యంలోనే ఈ నియామక బోర్డు పనిచేయనున్నట్లు సమాచారం. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి కామన్‌ రిక్రూట్‌మెంట్‌కు అనుగుణంగా త్వరలోనే యూనివర్సిటీ యాక్ట్‌ను చట్టసవరణ చేయనున్నట్లు తెలుస్తోంది.

నేరుగా వీసీల నియామకం?…
మహిళా యూనివర్సిటీ, పారెస్ట్‌ యూనివర్సిటీలను వీసీలను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు వర్సిటీలకు సెర్చ్‌ కమిటీలు వేయకుండానే వీసీలను నియమించనున్నారు. మొదటి సారికాబట్టి సెర్చ్‌ కమిటీలను నియమించకుండానే వీసీలను ఏర్పాటు చేయవచ్చని ప్రభుత్వ భావిస్తోంది. ఆ దిశగానే త్వరలో ఈ రెండు విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలిసింది.

3500 పోస్టులు భర్తీ…
ఇకపై విశ్వవిద్యాలయాల సిబ్బంది నియామకాలు ఒకే ఒక నియామక సంస్థ (కామన్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డ్‌) ద్వారా జరగనున్నాయి. ప్రస్తుతం ఏ విశ్వవిద్యాలయానికి ఆ విశ్వవిద్యాలయమే సిబ్బంది నియామకాలను చేపట్టే పద్ధతి అమలవుతున్నది. అందుకు భిన్నంగా ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధంగా అన్ని విశ్వవిద్యాలయాల సిబ్బంది నియామకాన్ని పారదర్శకంగా ఒకే నియామక సంస్థ ద్వారా జరపాలని గతంలో కేబినేట్‌ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే యూనివర్సిటీల్లోని 3,500 పైచిలుకు టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ నియామకాలను చేపట్టనున్నారు.

సీంఎతో మంత్రి సబిత భేటీ…
ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం భేఠీ అయ్యారు. గత ఏడు రోజులుగా బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు సంబంధించిన పూర్తి వివరాలను సీఎంకు మంత్రి సబిత వివరించినట్లుగా తెలిసింది. దాదాపు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో బాసర ట్రిపుల్‌ ఐటీలోని సమస్యలను సీఎం దృష్టికి మంత్రి తీసుకెళ్లినట్లుగా సమాచారం. అక్కడ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా వివరించినట్లుగా తెలిసింది. రెగ్యులర్‌ వీసీని నియమించాలనే విద్యార్థుల డిమాండ్‌ను కూడా సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement