చాలామందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది..స్టేజ్ పై మాట్లాడాలన్నా..పాట పాడాలన్నా వణికిపోతారు. ఇదో రకమైన ఫియర్ అనే చెప్పాలి. ఇదంతా సరే మన ఎదురుగా దేశాధ్యక్షులు..ప్రధానిలు ఉంటే..అమ్మో మాటలు కాదు కదా..వారి ఎదురుగా నిలబడటమే కష్టమనిపిస్తుంది. అయితే అలాంటి వారందరి ముందు ధైర్యంగా నిలబడటమే కాదు..తానేం చెప్పదలచుకుందో సూటిగా..సుత్తిలేకుండా చెప్పేసింది. మీరు ఇచ్చే హామీలు ఉత్తుత్తివేనని తేల్చి చెప్పింది. దాంతో ఆశ్చర్యపోవడం అక్కడున్నవారి వంతయింది. మరి వివరాల్లోకి వెళ్తే..భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వంటి మహామహులు ఆ వేదికపై ఉన్నారు. ఓ 14 ఏళ్ల టీనేజ్ అమ్మాయి.. వేదికపై మైకు తీసుకుని మాట్లాడడం మొదలుపెట్టింది.
ఆ అమ్మాయి పేరు వినీశా ఉమాశంకర్. ఆమె ఊరు తమిళనాడులోని తిరువణ్ణమలై జిల్లా. జర్మనీలోని గ్లాస్గోలో నిర్వహిస్తున్న కాప్ 26 సదస్సులో ఆమె పాల్గొంది. క్లీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ అనే అంశంపై ఉద్విగ్న భరితమైన ప్రసంగం ఇచ్చింది. బ్రిటన్ యువరాజు విలియమ్స్ ఆహ్వానం మేరకు ఆమె అక్కడి వరకు వెళ్లి ప్రపంచ వేదికపై తన గళాన్ని వినిపించింది. ప్రపంచ నేతలు చేస్తున్న ఉత్తుత్తి హామీలు విని మా తరం విసుగెత్తిపోతోంది. ఆ ఉత్తి హామీలను ఆపేయండి. పర్యావరణాన్ని రక్షించి ,భూమిని కాపాడండి. పాత చర్చలపై అనవసర ఆలోచనలను మానండి. నవ భవిష్యత్ కోసం నవ దృక్పథం ఎంతో అవసరం.
కాబట్టి మీరు మీ సమయాన్ని, డబ్బును, ప్రయత్నాలను మా లాంటి ‘ఎర్త్ షాట్ ప్రైజ్’ విన్నర్లు, ఫైనలిస్టుల ఆవిష్కరణలపై ఇన్వెస్ట్ చేయండి. శిలాజ ఇంధనాలు, పొగ, కాలుష్యం వంటి వాటి వల్ల నిర్మితమవుతున్న ఆర్థిక వ్యవస్థపై కాదని తెలిపింది. తమతో పాటు ప్రపంచ నేతలు కలిసి నడవాలని, స్వచ్ఛ ఇంధనాలను రూపొందించాల్సిన అవసరం ఉందని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చింది. పాతకాలపు ఆలోచనలు, అలవాట్లను వదులుకోవాలని సూచించింది. తాము పిలిచినప్పుడు మీరొచ్చినా..రాకున్నా.. తామే ముందుండి ఆ బాధ్యతను తీసుకుంటామని స్పష్టం చేసింది.
ప్రపంచ నేతలు ఆలస్యం చేసినా తాము రంగంలోకి దిగుతామని పేర్కొంది. తమ భవిష్యత్తును తామే కాపాడుకుంటామని తేల్చి చెప్పింది.నేను కేవలం భారత్ బిడ్డనే కాదు.. ఈ ధరిత్రీ పుత్రికను. అందుకు నేను గర్విస్తున్నానని ప్రారంభించింది. మీరు చేసే..చెప్పే వాగ్థానాలు వినీ విని విసుగువస్తోంది… మిమ్మల్ని చూస్తే కోపం వస్తోంది.. కానీ, నాకు అంత సమయం లేదు. చేతల్లోనే చేయాలి. ఇక మీరు చెప్పింది చాలు.. చేతల్లో చూపించండి అంటూ ప్రపంచాధినేతలకు భయం..బెరుకు లేకుండా సూటిగా చెప్పేసింది. అంతే అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరనే ఆరాలు మొదలుపెట్టారు నెటిజన్స్.