ఆర్మీ..పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణతో ఆఫ్రికా దేశంలో సూడాన్ అల్లర్లతో అట్టుడుకుతున్నది. ఆర్మీ, శక్తిమంతమైన పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. దీంతో పలు చోట్ల కాల్పులు, బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. రాజధాని ఖార్టూమ్ , దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో 50 మందికిపైగా సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 183 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సూడాన్ సెంట్రల్ మెడికల్ కమిటీ తెలిపింది. బాధితులు సెంట్రల్ ఖార్టూమ్ దవాఖానలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నది. వారిలో సాధారణ పౌరులతోపాటు మిలిటరీ సిబ్బంది కూడా ఉన్నారని వెల్లడించింది.పారా మిలిటరీ ‘ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్’ను సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదన దేశంలో అగ్నికి ఆజ్యంపోసింది. ఇది ఆర్మీ, పారా మిలిటరీ బలగాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ విషయమై సైన్యాధినేత అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ మహ్మద్ హందాన్ డగ్లో మధ్య కొన్ని వారాలుగా నెలకొన్న విభేదాలు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ క్రమంలో ఖార్టూమ్ సహా పలు ప్రాంతాల్లో ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement