తెలుగు ప్రజల రుణం తీర్చుకోలేనిదంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ భావోద్వేగానికి గురయ్యారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఇటీవల ఏపీ, తెలంగాణలో పర్యటించిన ఆయన.. తన అనుభూతులతో కూడిన లేఖను విడుదల చేశారు. భారత న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానానికి చేరుకున్న ఈ సమయంలో తనను చూసి గర్వించడానికి, మనస్ఫూర్తిగా అభినందించడానికి తల్లిదండ్రులు ఈ లోకంలో లేరన్న ఆలోచన తనను బాధిస్తుండేదని, కానీ సీజేఐగా గత వారం రోజులు పర్యటనలో తెలుగు ప్రజలు ఆ లోటు తీర్చారని లేఖలో పేర్కొన్నారు. కోవిడ్‌ను సైతం లెక్కచేయకుండా అసంఖ్యాకంగా వచ్చి తనను ఆశీర్వదించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల పర్యటన ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఆదరాభిమానాలు చూపిన తెలుగు ప్రజలకు శతకోటి వందనాలు అంటూ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో పర్యటన తనను భావోద్వేగాలకు గురిచేసిందని ఎన్వీ రమణ చెప్పారు. తెలుగు ప్రజల దీవెనలతో సీజేఐ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తానని ఉద్ఘాటించారు. తెలంగాణ రాజ్ భవన్, హైకోర్టు, పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. తిరుమల, యాదాద్రి, శ్రీశైలం పాలకమండళ్లకు కృతజ్ఞతలు తెలిపారు.