పెద్దపల్లి జిల్లాలో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కుంభకోణాలను బయటపెట్టేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. సోమవారం పెద్దపల్లి జిల్లాలో సివిల్ సప్లయి అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి ఏక కాలంలో తనిఖీలు చేపడుతున్నారు. సుల్తానాబాద్ ప్రాంతంలోని మిల్లుల్లో అధికారులు సీఎంఆర్ బియ్యం లెక్క తేల్చేందుకు రికార్డులు పరిశీలిస్తున్నారు. అధికారుల తనిఖీలలో భారీ కుంభకోణాలు బహిర్గతమయ్యే అవకాశాలున్నాయి.
ఇటీవలే పౌరసరఫరాల శాఖ సీఎంఆర్ కింద రైస్ మిల్లుకు ఇచ్చిన వడ్లను బియ్యంగా మార్చి ఎఫ్‌సిఐకి లెవీ పెట్టాల్సిన మిల్లర్ బహిరంగ మార్కెట్లో అమ్ముకున్న వైనం బహిర్గతమైన విషయం విదితమే. లెవీ బియ్యంపై ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టగా సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామంలోని లక్ష్మీనరసింహ ఇండస్ట్రీకు పౌరసరఫరాల శాఖ 91,258 క్వింటాళ్ల ధాన్యాన్ని కేటాయించగా 5,95,98,278 రూపాయల విలువ గల 21,100 క్వింటాళ్ల బియ్యం మాయం చేసినట్లు గుర్తించారు. ఎఫ్‌సిఐకి లెవీపెట్టాల్సిన బియ్యాన్ని సదరు మిల్లర్ బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు గుర్తించారు. లేవీ బియ్యం అమ్ముకున్న లక్ష్మీనరసింహఇండస్ట్రీ యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రైస్ మిల్ యజమానులపై సుల్తానాబాద్ పోలీసులు కెసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు పెద్దపల్లి జిల్లాలోని రైస్ మిల్లుల్లో నిర్వహిస్తున్న తనిఖీలలో పెద్ద ఎత్తున కుంభకోణాలు బహర్గతమయ్యే అవకాశాలున్నాయి. జిల్లాలోని మిల్లర్లు లెవీ బియ్యం బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు సమాచారం. కోట్లాది రూపాయల విలువచేసే బియ్యం పక్కదారి పట్టినట్లు తెలిసింది. లోతుగా విచారిస్తే జిల్లాలోని రైస్ మిల్లుల్లో లెవీ ధాన్యం లెక్కలు తేలే అవకాశంతోపాటు మరిన్ని ఆసక్తికర విషయాలు బయట పడే అవకాశాలున్నాయి.