గుంటూరు – దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విజృంభించింది. సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారింది. దేశవ్యాప్తంగా రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కరోనా కట్టడికి కఠిన చర్యలు చేపట్టాయి. కొన్నిచోట్ల లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ విధించాయి. అంతేకాదు మాస్కు మస్ట్ చేశాయి. ఇంట్లో నుంచి బయటకు వస్తే మాస్కు ధరించాల్సిందే. అలాగే భౌతికదూరం పాటించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కానీ కరోనా మహమ్మారిని అదుపు చెయ్యడం సాధ్యమవుతుంది.ప్రభుత్వాలు నెత్తీ నోరు బాదుకుంటున్నా, భారీగా ఫైన్లు వేస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. మాస్కులు లేకుండానే రోడ్లపైకి వస్తున్నారు. బాధ్యతగా ఉండాల్సిన అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాగా.. రూల్ ఈజ్ రూల్.. అంటూ.. మాస్కు వేసుకుని సీఐకి ఫైన్ విధించారు జిల్లా ఎస్పీ. ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది._
గుంటూరు అర్బన్ పరిధిలో మాస్కు ధరించని వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఎస్పీ అమ్మిరెడ్డి లాడ్జికూడలి, ఎంటీబీ కూడలిలో స్పెషల్ డ్రైవ్‌లో పాల్గొన్నారు. లాడ్జి కూడలిలో తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లికార్జునరావు మాస్కు ధరించకుండా అటుగా వెళ్లడం ఎస్పీ గుర్తించారు. వెంటనే సీఐని ఆగమన్నారు. తన దగ్గరికి పిలిచారు. మాస్కు ఎందుకు ధరించలేదని సీఐని ప్రశ్నించారు. అత్యవసరంగా విధుల్లో హాజరవ్వడానికి వెళుతూ మర్చిపోయినట్లు సీఐ సమాధానమిచ్చారు. సీఐ సమాధానంతో ఎస్పీ సంతృప్తి చెందలేదు. కరోనా వైరస్ ఉద్ధృతంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో పోలీసులు సైతం జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. మాస్కు ధరించని కారణంగా సీఐకి అపరాధ రుసుం(ఫైన్) విధించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఎస్పీ స్వయంగా మాస్కు తెప్పించి సీఐకి తగిలించారు._