Saturday, November 23, 2024

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఎంత వరకు సబబు?: చిరంజీవి

నష్టాల్లో ఉందనే సాకుతో విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీలో ఉద్యమాలు నేటికి జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు, ప్రజలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ పోరాటాలు చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా స్టీల్ ప్లాంట్ అంశంపై మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో చాలా రాష్ట్రాలకు ఆక్సిజన్ అందిస్తూ బాహుబలిగా నిలిచింది విశాఖ ఉక్కు కర్మాగారం. ఈ నేపథ్యంలో చిరంజీవి స్పందించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎంత వరకు సబబు ? అని ప్రశ్నించారు.  విశాఖ ఉక్కు రోజుకు 100 టన్నుల ఆక్సిజన్ అందిస్తోందని తెలిపారు. విశాఖ ఉక్కు లక్షల మంది ప్రాణాలు కాపాడుతోందని చెప్పారు. ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్ అందిస్తోందని చిరంజీవి వివరించారు.

‘’ దేశమంతా ఆక్సిజన్ దొరక్క కరోనా పేషెంట్స్ అల్లాడిపోతున్నారు. ఈ రోజు ఓ స్పెషల్ ట్రైన్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చేరింది. అక్కడ నుంచి 150 టన్నుల ఆక్సిజన్ ని మహారాష్ట్ర తీసుకెళ్తుంది. విశాఖ ఉక్కు కర్మాగారం రోజుకి సుమారు 100 టన్నుల ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితిలో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించి లక్షల మంది ప్రాణాలని నిలబెడుతుంది. అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందని ప్రైవేట్ పరం చేయటం ఎంత వరకు సమంజసం? మీరే ఆలోచించండి ’’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

కాగా, ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. కరోనా రోగులకు ఎంతో అవసరమైన, వారి ప్రాణాలను కాపాడే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను తయారు చేస్తోంది. కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రులకు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచే పెద్ద ఎత్తున ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. గతేడాది స్టీల్ ప్లాంట్ నుంచి తెలుగు రాష్ట్రాలు, ఒడిశాకే ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మిగతా రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతోంది. స్టీల్ ప్లాంట్‌ అవసరాల కోసం ఏడాదికి లక్ష టన్నుల వరకు ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుంది.

స్టీల్ ప్లాంట్‌లోని ఆక్సిజన్ ప్లాంట్‌లో ప్రస్తుతం రోజుకి 100 టన్నుల నుంచి 150 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నారు. దీని సామర్ద్యం ఎక్కువగా ఉన్నప్పటీకి… అవసరాల మేరకే ఉత్పత్తి చేస్తున్నారు. దీనిలో కొంత భాగాన్ని మెడికల్ ఆక్సిజన్ గా మారుస్తున్నారు. అది ప్లాంట్‌లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు కోవిడ్ కారణంగా ఆసుపత్రులకు సరఫరా చేయడానికి దీన్ని ఎక్కువ తయారు చేయాల్సి వస్తోంది. ఏపీ, తెలంగాణా, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు గత నాలుగు రోజులుగా దాదాపు 500 టన్నుల వరకు పంపించినట్టు తెలుస్తోంది. కేంద్రం ఉత్పత్తి, సరఫరా పెంచమని చెప్పడంతో దీన్ని త్వరలో మరింత పెంచుతామంటున్నారు స్టీల్ ప్లాంట్ అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement