తాను సక్సెస్ ఫుల్ హీరోగా ఉండడానికి తన భార్య సురేఖనే కారణమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిరంజీవి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సినీ పరిశ్రమకు చెందిన మహిళా కార్మికులకు చీరలు పెట్టి సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి భార్య సురేఖ, ఆయన సోదరితో పాటు పలవురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం అందరూ కృషి చేయాలని చెప్పారు. అమ్మ వల్లే స్త్రీ పక్షపాతిగా మారానని, స్త్రీ పక్షపాతిగా మారడానికి మరోకారణం సురేఖ అని తెలిపారు. తాను ఈ స్థాయికి రావడానికి తన భార్య సురేఖనే కారణమని చిరంజీవి అన్నారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా సురేఖను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అంటూ చిరంజీవి కొనియాడాడు.
పుట్టినింటితో పాటు మెట్టినింటి బాధ్యతలను తీసుకుంటూ మహిళలు ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు. అంతరిక్షంలోకి మహిళలు వెళ్తున్నారని అన్నారు. అన్ని రంగాల్లోనూ గొప్ప విజయాలు సాధిస్తూ మహిళా సాధికారత సాధిస్తున్నారని చెప్పారు. చంద్రమండలం, ఒలింపిక్స్ స్థాయికి మహిళలు ఎదిగారని వ్యాఖ్యానించారు. మొదట మనం ఇంట్లో అమ్మ, సోదరిల సాధికారతను కృషి చేయాలని ఆయన చెప్పారు. ప్రపంచం గర్వించే స్థాయిలో స్త్రీ శక్తి ఉండాలని మెగాస్టార్ ఆకాంక్షించారు.