Thursday, November 14, 2024

COVID-19: చైనాలో కరోనా విలయతాండవం

కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. చైనాలో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 24,326 కేసులు వెలుగు చూశాయి. నేషనల్ హెల్త్ కమిషన్ నివేదిక ప్రకారం ఆదివారం షాంఘైలో 1,401 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా కట్టడికి లాక్ డౌన్ అమలు చేస్తున్నా.. చాలా ప్రాంతాల్లో మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. దేశంలో వైరస్ తొలిసారి వెలుగుచూసినప్పుడు కూడా లేనంతగా ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి.  ఈ రెండేళ్లలో ఏనాడూ లేనంతగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది.

షాంఘైలో 12 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. రాజధాని బీజింగ్‌లో 10 మంది విద్యార్థులు వైరస్ బారినపడ్డారు. కరోనా కట్టడికి ఆ దేశం అవలంబిస్తున్న జీరో-కొవిడ్ విధానం సత్ఫలితాలను  ఇవ్వడం లేదు. అయినప్పటికీ ఇదే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా లాక్‌డౌన్‌తోపాటు కఠిన ఆంక్షలు విధించడంతో షాంఘైలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అతిపెద్ద నగరమైన షాంఘైతో పాటు పలు ప్రధాన నగరాల్లోనూ కఠినమైన లాక్‌డౌన్‌ అమలు అవుతోంది. వైద్య సిబ్బంది, డెలివరీ బాయ్స్‌, ఎమర్జెన్సీ స్టాఫ్‌ తప్ప.. ఎవరూ బయట అడుగు పెట్టడానికి వీల్లేదని అధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు షాంఘై చుట్టుపక్కల నగర వాసుల్లో ఇప్పుడు లాక్‌డౌన్‌ ఆందోళన మొదలైంది. రెండువారాల పాటు అధికారులు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో జనం బెంబెలెత్తిపోతున్నారు. తమ దగ్గరా షాంఘై తరహా పరిస్థితులు పునరావృతం అవుతుందని వణికిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement