Tuesday, November 26, 2024

జాక్ మాను వదలని డ్రాగన్.. భారీగా ఫైన్!

ప్రపంచ కుబేరుడు, చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జాక్‌ మాను డ్రాగన్‌ అంత తేలిగ్గా వదిలిపెట్టేట్లు లేదు. ఇప్పటికే పలు విధాలుగా జాక్‌ మాను ఇబ్బంది పెడుతున్న చైనా ప్రభుత్వం.. తాజాగా మరోసారి అలీబాబా సంస్థపై ఆంక్షల కొరడా ఝుళిపించింది. నియంత్రణ పేరుతో జాక్‌మా సంస్థపై చైనా భారీ జరిమానా విధించింది. గుత్తాధిపత్య వ్యతిరేక నిబంధనలు వ్యతిరేకించారన్న ఆరోపణలపై కొరఢా ఝుళిపించింది.

అలీబాబా గ్రూప్‌ ఇతర సంస్థల నుంచి తనకు పోటీ లేకుండా చేసుకునేందుకు అనేక వ్యూహాలు రచిస్తోందని చైనా మార్కెట్‌ రెగ్యులేషన్‌ ఆరోపించింది. గుత్తాధిపత్య వ్యతిరేక చర్యల్లో భాగంగా ఆ సంస్థపై 18.3 బిలియన్‌ యువాన్ల(2.8బిలియన్‌ డాలర్లు) జరిమానా విధించింది. ఈ జరిమానా విలువ 2019లో అలీబాబా దేశీయ అమ్మకాల్లో నాలుగు శాతానికి సమానం. అలీబాబా గ్రూప్‌ అలీబాబా తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసినందుకే జరిమానా విధించినట్లు చైనా అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ మార్కెట్‌ రెగ్యులేషన్‌ శనివారం తెలిపింది. ఆన్‌లైన్ రిటైలింగ్‌లో పోటీని పరిమితం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్‌ పరిశ్రమలపై మరింత నియంత్రణలో భాగంగా చైనా అధికారిక కమ్యూనిస్టు పార్టీ గతంలో యాంటీ మోనోపలీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యలు చేపట్టింది. ఈ ఏడాది దీనిపై మరింత దృష్టిపెట్టి ఇప్పటికే పలు టెక్‌ కంపెనీలకు భారీ జరిమానాలు విధించింది. టెన్సెంట్‌ హోల్డింగ్స్‌, వీ-చాట్‌ వంటి సంస్థలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే జాక్‌మాతో విరోధం కొనసాగుతున్న సమయంలో అలీబాబాకు ఇంతటి భారీ స్థాయిలో జరిమానా విధించడం. కాగా,  గతేడాది అక్టోబరు 24న చైనా బ్యాంకింగ్‌ వ్యవస్థలోని లోపాల్ని ఎత్తిచూపడంతో జాక్‌ మాపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని జాక్‌ మా హితవు పలికారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డ చైనా అగ్రనాయకత్వం‌ ప్రతీకార చర్యలకు పూనుకుంది. ఆయన వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. ఈ క్రమంలో రెండు నెలల పాటు జాక్‌ మా కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement