దుందుడుకు చర్యలతో కవ్విస్తున్న చైనా దుస్సాహసానికి తెగబడుతోంది. సరిహద్దుల్లో మరోసారి డ్రాగన్ రెచ్చిపోయింది. లడఖ్‌లో జూన్ చివరి వారంలో నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి భారత స్థావరాలకు అతి సమీపంలో చైనా విమానం ఎగిరింది. వెంటనే అప్రమత్తమైన భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఎలాంటి దుస్సాహసం ఎదురైనా తిప్పికొట్టేందుకు రెడీగా ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తూర్పు లడఖ్ ప్రాంతంలో భారత్ గగనతలంలోకి ప్రవేశించేందుకు డ్రాగన్ కొద్దినెలలుగా ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుందని అధికార వర్గాలు తెలిపాయి.
సరిహద్దు ప్రాంతంలో మోహరించిన ఓ ఐఏఎఫ్ రాడార్ చైనా విమాన కదలికలను పసిగట్టింది. తూర్పు లడఖ్‌లో తన ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో చైనా ఎయిర్ ఫోర్స్ భారీ విన్యాసాలు చేపట్టిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై ఉన్నతాధికారులు చైనా దృష్టికి తీసుకువెళ్లి భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించాలని కోరారు. 2020 తరహాలో సరిహద్దుల్లో చైనా ఎలాంటి దుస్సాహసానికి తెగబడినా తిప్పికొట్టేందుకు భారత్ రెడీగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి.